Updated : 01 Dec 2020 12:08 IST

కరోనా అంటే కిమ్‌కు ఎందుకంత భయం?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరడుగట్టిన నియంత. దేశంలో ఏ ఒక్క పౌరుడు ఆయన మాట జవదాటకూడదు. పేదరికంలో మగ్గుతున్నా.. ఆకలితో అలమటిస్తున్నా దేశంలోనే ఉండాలి. ఆయన విధించే కఠిన నియమాలకు కట్టుబడాలి. ఇప్పటికే ఆయనెవరో అర్థమై ఉంటుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఇప్పుడు ఆయనకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్‌. ఎక్కడ ఈ మహమ్మారి దేశంలోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తుందోనని కిమ్‌ వణికిపోతున్నట్లు అనధికారిక సమాచారం. మరి ఎందుకంత భయం..? కరోనా కట్టడి కోసం కిమ్‌ ఎంతదూరం వెళ్లారు..?

కనిపిస్తే కాల్చేయండి..

కరోనాను కట్టడి చేయడంలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని అధికారుల్ని కిమ్‌ హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించిన వారికి మరణ దండన విధించడానికీ వెనకాడడం లేదని సమాచారం. ఇటీవల విధుల్లో ఏమరపాటుగా ఉన్న ఇద్దరు అధికారులకు మరణ శిక్ష విధించినట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థలు తెలిపాయి. ఎవరైనా సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించినా.. లేదా ఎవరైనా దేశాన్ని విడిచివెళుతున్నట్లు తెలిసినా వారిని వెంటనే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని విదేశీయులను క్వారంటైన్‌కు తరలించారు. దౌత్యవేత్తలు, రాయబారులను ఇళ్లకే పరిమితం చేశారు. ప్రజల కదలికలపై ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించిన కిమ్‌ సర్కార్‌.. వాటిని మరింత కఠినతరం చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచింది. దిగుమతుల్ని పూర్తిగా నిషేధించింది. సముద్ర తీరాలకు కొట్టుకొచ్చే చెత్తను సైతం ఎప్పటికప్పుడు కాల్చిపారేయాలని కిమ్‌ ఆదేశించారట. 

ఎందుకంత భయం..

మహమ్మారి వెలుగులోకి రాగానే సరిహద్దుల్ని మూసివేసిన తొలి దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. దాదాపు అన్ని దేశాల నుంచి ప్రయాణాల్ని నిషేధించారు. ఓ వ్యక్తి చైనా నుంచి కేసాంగ్‌ అనే నగరంలోకి ప్రవేశించాడనే అనుమానంతో ఏకంగా ఆ నగరం మొత్తాన్ని లాక్‌డౌన్‌లో ఉంచారు. వుహాన్‌లో వైరస్‌ వెలుగులోకి రాగానే కిమ్‌ సర్కార్‌ అప్రమత్తమైంది. మెరుగైన వైద్య సదుపాయాలున్న చైనాయే వైరస్‌ ధాటికి విలవిల్లాడుతుంటే కిమ్‌ వణికిపోయారు. ప్రథమ చికిత్సకు కూడా వసతులు లేని ప్రాంతాలు ఉత్తర కొరియాలో అనేకం. గత కొన్నేళ్లలో అక్కడ వైద్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇప్పటికీ అక్కడ మత్తు మందు లేకుండా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక వైద్యులు ఔషధాలు విక్రయించి పొట్టపోసుకుంటారని చెబుతుంటారు. ఇంతటి దీనస్థితిలో ఉన్న వైద్య వ్యవస్థతో కరోనాపై పోరు సాధ్యం కాకపోవచ్చునని కిమ్‌ ముందే గ్రహించారు. మహమ్మారి విజృంభిస్తే దేశం అతలాకుతలమై ప్రజల పిట్టల్లా రాలిపోవడం ఖాయమని నిర్ణయించుకున్నారు. పైగా.. స్వయంగా కిమ్‌ అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య ఆయన కనిపించకుండా పోవడంతో అనేక వదంతులు వినిపించాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన వర్కర్స్‌ పార్టీ వార్షికోత్సవాల్లో పాల్గొన్న కిమ్‌.. కంటతడి పెట్టడం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందనడానికి నిదర్శనం అని దక్షిణ కొరియా దౌత్యవేత్తలు విశ్లేషించారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశిస్తే ఎక్కడ తన వరకూ వస్తుందోనన్న ఆందోళన కిమ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అమెరికా సహా ఐరోపా దేశాలు సైతం మహమ్మారి ధాటికి విలవిల్లాడుతుంటే కిమ్‌ మరింత ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరకొరియాకు ఆరోగ్య సంక్షోభాన్ని అధిగమించడం అసాధ్యమేనని కిమ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని ఆకలి చావులు..

ఉత్తరకొరియాకున్న ఏకైక వాణిజ్య భాగస్వామి చైనా. ఆ దేశంలోకి సింహభాగం దిగుమతులు డ్రాగన్‌ నుంచే వస్తాయి. దీంతో ఎక్కడ దిగుమతుల ద్వారా వైరస్‌ దేశంలోకి ప్రవేశిస్తుందోనని ఎగుమతులు-దిగుమతుల్ని పూర్తిగా నిలిపివేశారు. బీజింగ్‌ నుంచి ఉత్తరకొరియా వెళ్లే దిగుమతులు అక్టోబరులో ఏకంగా 99శాతం పడిపోయినట్లు చైనా అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కిమ్‌ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలో ఆహార పదార్థాలు, ఇంధన కొరత ఏర్పడుతోందని సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆకలి చావులతో అలమటిస్తున్న ఉత్తరకొరియా ప్రజలకు కిమ్‌ అనాలోచిత నిర్ణయాలు జీవన్మరణ సమస్యగా మారాయి. చైనాలో వైరస్‌ పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వచ్చింది. అయినా కిమ్‌ ఆంక్షల్ని కఠినతరం చేస్తున్నారంటే ఆయనలో ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని