భారీ కుదుపులు.. ప్రయాణికుల అరుపులు

మరికొంతసేపట్లో ఇంటికి చేరుకోబోతున్నాం అనే ఆనందం కొద్ది సెకన్లలోనే ఆవిరైపోయినట్లు..

Published : 09 Aug 2020 14:29 IST

ఆనందం ఎంతోసేపు నిలువలేదన్న విమాన ప్రయాణికులు

తిరువనంతపురం: మరికొంతసేపట్లో ఇంటికి చేరుకోబోతున్నాం అనే ఆనందం కొద్ది సెకన్లలోనే ఆవిరైపోయినట్లు పేర్కొంటున్నారు విమాన ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న ప్రయాణికులు. ఆ భయానక క్షణాలు పీడకలలా వెంటాడుతున్నాయని బోరుమంటున్నారు. ‘వందేభారత్‌ మిషన్‌’లో భాగంగా దుబాయ్‌ నుంచి 190 మందితో కేరళలోని కోలికోడ్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిరిండియా విమానం ప్రమాదవశాత్తు 35 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా అనేకమంది గాయాలపాలయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్న వారు ఆ దుర్ఘటనకు సంబంధించిన భయానక అనుభవాలను పంచుకుంటున్నారు. కొద్ది క్షణాల వ్యవధిలోనే దుర్ఘటన జరిగిపోయిందని పేర్కొంటున్నారు.

‘విమానం ల్యాండ్‌ అవ్వగానే సంతోషించాం. వర్షం మనకు స్వాగతం పలుకుతోందని నా భార్యతో చెప్పాను. కానీ, మా ఆనందం కొద్ది క్షణాల్లోనే మాయమైపోయింది. విమానం ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైంది. భయాందోళన చెందిన ప్రయాణికులు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. నేను నా సీట్లో నుంచి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాను. అనంతరం కళ్లు తెరిచి చూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. బతికి ఉన్న నా భార్యను చూడగానే మనసు కుదుటపడింది. మా పక్క సీట్లో ఉన్న గర్భిణి మా అంత అదృష్టవంతురాలు కాదు’ అని చెమర్చిన కళ్లతో చెప్పాడు ఓ ప్రయాణికుడు. 

విమానంలో ఒక్కసారిగా వెలువడ్డ భారీ కుదుపులతో ఏం జరుగుతోందో అర్థం కాలేదన్నాడు మరో ప్రయాణికుడు. జరిగిన విషాదం నమ్మశక్యంగా లేదని పేర్కొన్నాడు. ‘విమానం కుదుపులకు గురవుతోంటే ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఒక్కసారిగా విమానం ముక్కలైంది. దీంతో అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. కొందరు ప్రయాణికులు వెంటనే ఆ ద్వారాల గుండా బయట దూకారు. ప్రమాదం ఓ పీడకలలా ఉంది’ అని పేర్కొన్నాడు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు