
పోలీసు సవరణ చట్టంపై వెనక్కి తగ్గిన కేరళ!
కొచ్చి: కేరళ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద పోలీస్ సవరణ చట్టంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం స్వేచ్ఛాయుత ప్రసంగాలకు భంగం కలిగించేలా ఉందని ప్రతిపక్షాల నుంచి ఆందోళనలు వెల్లువెత్తిన తరుణంలో దాన్ని వెనక్కి తీసుకునేందుకు మొగ్గుచూపింది. ఇందుకోసం గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్‌కు సెక్షన్ 118-ఎ రద్దు చేయమని ఆర్డినెన్స్ జారీ చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక కేబినెట్ కమిటీ మంగళవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పోలీసు చట్టంలో సవరణలు చేస్తూ కేరళ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ గత ఆదివారం సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ సవరణ చట్టం ప్రకారం.. మహిళలు లేదా ఇతరులపై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేస్తే వారు శిక్షార్హులుగా పరిగణలోకి వస్తారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.10వేల జరిమానా విధిస్తారు. దీంతో ఈ చట్టంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం, శశిథరూర్ సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా స్వేచ్ఛాయుత ప్రసంగానికి, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.