Published : 15/09/2020 15:04 IST

శుక్రుడిపై జీవం ఉందా?

పరిశోధనలో ఆసక్తికర ఆధారాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇతర గ్రహాలపై జీవం కోసం మానవుడు సాగిస్తున్న అన్వేషణలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శుక్రగ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని ఇటీవల కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రహం వాతావరణంలో స్వల్ప స్థాయిలో ఫాస్పీన్‌ వాయువు ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. వరుసలో మనకంటే ముందు ఉండే శుక్రుడిపై పగటి ఉష్ణోగ్రతలు సీసాన్ని కరిగించే స్థాయిలో ఉంటాయి. అలాగే వాతావరణంలో భారీ స్థాయిలో కార్బన్‌డయాక్సైడ్‌ ఉంటుంది. అక్కడి మేఘాల్లో 90 శాతం సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ జీవరాశి మనుగడ దాదాపు సాధ్యం కాదనే భావించారు. కానీ, ఫాస్పీన్‌ వాయువు ఆనవాళ్లు కనిపించడంతో అనుమానాలు మొదలయ్యాయి.

జీవం ఉనికిలో ఉన్న ప్రాంతంలో మాత్రమే ఫాస్పీన్‌ వాయువు ఉత్తత్తి సాధ్యమవుతుందని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా ఈ గ్యాస్‌ కర్బన పదార్థాలు కుళ్లే ప్రక్రియలో ఉత్పత్తవుతుంది. అలాగే ఆక్సిజన్‌ రహిత జీవులూ(అనరోబిక్‌ లైఫ్‌ఫామ్స్‌) దీన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రయోగశాలల్లోనూ దీన్ని తయారుచేయవచ్చు. కానీ, దీనికి మండే స్వభావం అధికం. చిలీలోని అటకామా ఎడారి, అమెరికాలోని హవాయిలో ఉన్న టెలిస్కోపులతో పరిశోధకులు ఈ గ్యాస్‌ ఆనవాళ్లను గుర్తించారు. ఈ అధ్యయనంలో మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కార్డిఫ్‌ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌, క్యోటో శాంగ్యో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పాల్గొన్నారు. దీనికి కార్డిఫ్‌ యూనివర్సిటీకి చెందిన జేన్‌ ఎస్ గ్రీవ్స్‌ నేతృత్వం వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ‘నేచర్‌ ఆస్ట్రానమీ’ జర్నల్‌లో ప్రచురించారు. శుక్రగ్రహం ఉపరితలం నుంచి 60 కి.మీ ఎత్తులో ఉన్న వాతావరణంలో ఈ వాయువు ఉన్నట్లు భావిస్తున్నారు.

ఫాస్పీన్‌ వాయువు ఉన్నంత మాత్రాన జీవం ఉందని కచ్చితంగా చెప్పలేమని కూడా పరిశోధకులు వెల్లడించారు. ఫాస్పీన్‌ ఉన్నందున.. జీవం ఉండే అవకాశం ఉందన్నది తమ భావన మాత్రమే అని స్పష్టం చేశారు. మానవుడు ఇప్పటి వరకు కనుగొనలేని ఇతర రసాయనిక ప్రక్రియల ద్వారా ఇది ఉత్పత్తయ్యే అవకాశాన్నీ కొట్టిపారేయాలేమన్నారు. అయితే, ఫాస్పీన్‌ ఉత్పత్తి కోసం ఇప్పటి వరకు వేలాది రసాయనిక చర్యలను జరిపామన్నారు. అయినా సాధ్యపడలేదన్నారు. దీనిపై మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉందని తెలిపారు. సౌరగాలులు, నిరంతర రసాయనిక ప్రక్రియల వల్ల స్వల్ప స్థాయిలో ఫాస్పీన్‌ ఉత్పత్తయినప్పటికీ.. అది గుర్తించే స్థాయిలో ఉండేందుకు శుక్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులు అనుకూలించవని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కానీ, ‘20 పార్ట్స్‌ పర్‌ బిలియన్‌’ స్థాయిలో గుర్తించగలిగామని తెలిపారు. అంటే ఆ వాయువు ఉత్పత్తికి అంతుచిక్కని ప్రక్రియేదో జరుగుతున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. అది జీవరాశే అయ్యుండొచ్చన్నది వారి అంచనా.  

ఈ అధ్యయనంపై స్విన్‌బర్న్‌కు చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆలెన్‌ డఫీ మాట్లాడుతూ.. ఇతర గ్రహాలపై జీవం కోసం జరుపుతున్న అన్వేషణలో ఇప్పటి వరకు లభించిన ఆధారాల్లో ఇదే అత్యంత దగ్గరగా, ఆమోదనీయంగా ఉందని తెలిపారు. నాసా సైతం ఈ పరిశోధనను ప్రశంసించింది. సంస్థ చీఫ్‌ జిమ్‌ బ్రిడెన్‌స్టైన్‌ స్పందిస్తూ..‘‘శుక్రుడికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని వ్యాఖ్యానించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని