నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా..:  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

కొవిడ్‌ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆయన దుస్తుల్ని ఆయనే ఉతుక్కుంటున్నారు. అలా చేయడం తనకు ఎంతగానో ఉపయోగపడుతోందని స్వయంగా........

Published : 29 Jul 2020 01:08 IST

కొవిడ్‌ ఓ రకంగా తనకు మేలే చేసిందంటున్న మధ్యప్రదేశ్‌ సీఎం

భోపాల్‌: కొవిడ్‌ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆయన దుస్తుల్ని స్వయంగా ఉతుక్కుంటున్నారు. అలా చేయడం తనకు ఎంతగానో ఉపయోగపడుతోందని ఆయనే ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ‘‘ఆస్పత్రిలో నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. నా బట్టల్ని నేనే ఉతుక్కుంటున్నాను. ఇది నాకు ఎంతో ఉపయోగపడుతోంది. గతంలో నా చెయ్యికి శస్త్రచికిత్స జరిగింది. ఎన్నోసార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నాను. అయినా, పిడికిలి బిగించడానికి ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కుంటుండడంతో ఆ సమస్య తొలగిపోయింది. ఇలాంటి చిన్న చిన్న పనులు మనమే చేసుకుంటే బాగుంటుంది’’ అని చౌహాన్‌ అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించేందుకు చౌహాన్‌ వరుసగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం మంత్రులతో మాట్లాడిన ఆయన.. ఈరోజు ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చిరయు మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పటల్‌ ప్రకటించింది. స్వల్ప స్థాయిలో దగ్గు మినహా ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది. పౌష్టికాహారం తీసుకుంటూ.. ఉదయం యోగా, వ్యాయామం చేస్తూ చికిత్సను కొనసాగిస్తున్నారని వెల్లడించింది. కరోనా సోకిన విషయాన్ని స్వయంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన భార్యాపిల్లలకు మాత్రం నెగిటివ్‌ వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని