ప్రియాంక దుస్తులపై చేయివేయడానికి ఎంత ధైర్యం?

హాథ్రస్‌ హత్యాచార బాధిత యువతి కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను ఓ పోలీసు చేయి పట్టుకుని నిలువరించడంపై భాజపా మహిళా నేత ఒకరు తీవ్రంగా మండిపడ్డారు. ‘మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి

Updated : 05 Oct 2020 11:18 IST

యూపీ పోలీసుల తీరుపై భాజపా నేత మండిపాటు

ముంబయి: హాథ్రస్‌ హత్యాచార బాధిత యువతి కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను ఓ పోలీసు చేయి పట్టుకుని నిలువరించడంపై భాజపా మహిళా నేత ఒకరు తీవ్రంగా మండిపడ్డారు. ‘మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి ఆ పోలీసు అధికారికి ఎంత ధైర్యం?’ అని మహారాష్ట్ర భాజపా ఉపాధ్యక్షురాలు చిత్రా కిషోర్‌ వాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..

గత శనివారం హత్యాచార బాధిత యువతి కుటుంబసభ్యులను కలుసుకునేందుకు దిల్లీ నుంచి వెళ్లిన కాంగ్రెస్‌ ప్రతినిధులను గ్రేటర్‌ నోయిడా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఒకింత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో అక్కడే ఉన్న ప్రియాంక గాంధీ కార్యకర్తలకు దెబ్బలు తగలకుండా ఉండేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఓ పోలీసు అధికారి ప్రియాంక చేయి పట్టుకుని బలవంతంగా నిలువరించే ప్రయత్నం చేశారు. ఇది తీవ్ర దుమారానికి దారితీసింది. 

మహిళా నాయకురాలిపై పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా భాజపా మహిళా నేత అయిన చిత్రా వాగ్‌ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి మగ పోలీసుకు ఎంత ధైర్యం?’ అని ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. భారత సంస్కృతి, సంప్రదాయాలపై విశ్వాసం కలిగిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై తీవ్రంగా స్పందించాలని, సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు తమ పరిమితులు తెలుసుకుని మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. 

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై స్పందించిన యూపీ గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌ పోలీసులు ప్రియాంక గాంధీకి క్షమాపణలు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని