మెక్సికోలో భారీ సంఖ్యలో కొవిడ్‌ మరణాలు!

కరోనా వైరస్‌ ధాటికి మెక్సికో వణికిపోతోంది. ఇప్పటివరకు అక్కడ 7లక్షల 33వేల కేసులు, 76,603 మరణాలు చోటుచేసుకోగా తాజాగా ఈ సంఖ్య భారీగా ఉండవచ్చని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Published : 29 Sep 2020 23:09 IST

మెక్సికో సిటీ: కరోనా వైరస్‌ ధాటికి మెక్సికో వణికిపోతోంది. ఇప్పటివరకు అక్కడ 7లక్షల 33వేల కేసులు, 76,603 మరణాలు చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా ఈ సంఖ్య భారీగా ఉండవచ్చని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాదాపు లక్షా 37వేల కేసులు, 13వేల మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా 8లక్షల 70వేల కేసులు, మరణాల సంఖ్య 89వేలకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. అయితే, ప్రస్తుతం అక్కడ తక్కువ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 16లక్షల పరీక్షలు మాత్రమే చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సమయంలో పాజిటివిటీ రేటు 40శాతం ఉండటంతో కేవలం తీవ్ర లక్షణాలు ఉన్నవారికే కొవిడ్‌ టెస్టులు చేస్తున్నారనే వాదన కూడా ఉంది.

 ఈ పెరుగుదలకు ఇప్పటివరకు పెండింగులో ఉన్న కొవిడ్‌ టెస్టుల ఫలితాలే కారణమని ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్‌ లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్ష చేయని వారిని, సరైన సమయంలో శాంపిళ్లను కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాలకు అందని లేదా సరైన పద్ధతిలో వాటిని భద్రపరచకపోయిన వాటిని పరిగణలోకి తీసుకున్నామని తెలిపింది. ఇలా ఇప్పటికే దాదాపు 96వేల శాంపిళ్లు పనికిరాకుండా పోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. తాజా నివేదికలతో మెక్సికోలో మరింతగా వైరస్‌ విజృంభణకు ఆస్కారం ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇక కొవిడ్‌ మరణాల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న మెక్సికో, కేసుల్లో మాత్రం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని