వ్యాక్సిన్‌: భారీ మొత్తంలో చెల్లించిన మెక్సికో

కరోనా సృష్టిస్తున్న అలజడికి ఎప్పుడెప్పుడు అడ్డుకట్ట పడుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. దీనిలో భాగంగా కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి దేశాలన్నింటికీ పారదర్శకంగా అందించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పడిన కోవాక్స్‌ కూటమిలో పలు దేశాలు ఇప్పటికే చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలకు...

Published : 11 Oct 2020 15:40 IST

మెక్సికో సిటీ: కరోనా సృష్టిస్తున్న అలజడికి ఎప్పుడెప్పుడు అడ్డుకట్ట పడుతుందా?అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. దీనిలో భాగంగా కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి దేశాలన్నింటికీ పారదర్శకంగా అందించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పడిన కొవాక్స్‌ కూటమిలో పలు దేశాలు ఇప్పటికే చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలకు డబ్ల్యూహెచ్‌వో తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ కోసం మెక్సికో ప్రభుత్వం 159.88 మిలియన్‌ డాలర్లను( దాదాపు రూ.900కోట్లకు పైగా) డబ్ల్యూహెచ్‌వోకు చెల్లించింది. దీంతో మెక్సికోలోని 12.5 కోట్ల జనాభాలో ఐదో వంతు మందికి వ్యాక్సిన్‌ సరఫరా చేసే అవకాశముంది. 

అంతేకాకుండా మరో 20.6 మిలియన్‌ డాలర్లకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెక్సికో విదేశాంగశాఖ తెలిపింది. అయితే తాజా ప్రకటనలో రెండో విడత నిధుల గురించి ప్రస్తావించలేదు. మెక్సికో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 8,10,000 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. 83,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. గత నెలలోనే మెక్సికో కొవాక్స్‌ కూటమిలో చేరింది.

వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన దేశాల నుంచి దాన్ని కొనుగోలు చేసి, ప్రపంచవ్యాప్తంగా పారదర్శకంగా సరఫరా చేయాలన్న లక్ష్యంతో కొవాక్స్‌ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని అల్పాదాయ దేశాలు సైతం వేగంగా, పారదర్శకంగా, అందరితో సమానంగా కొవిడ్ టీకాను పొందేందుకు ఈ కూటమి కృషి చేస్తోంది. 2020 చివరికల్లా 200 కోట్ల డాలర్లు సమీకరించాలని దీనిలో చేరిన దేశాలు లక్ష్యంగా పెట్టుకొన్నాయి. దీని ద్వారా వ్యాక్సిన్ పరిశోధనలు, అభివృద్ధి, తయారీ, పంపిణీ సామర్థ్యం పెంచేందుకు ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న అనేక టీకా ప్రాజెక్టులను కొవాక్స్‌ పరిధిలోకి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని