బీరుట్‌ పేలుళ్లు: నిర్లక్ష్యమా? రాకెట్‌ దాడా?

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో మూడు రోజుల క్రితం జరిగిన భీతావహ ఘటనకు కారణాలు విశ్లేషించే పనిలో అక్కడి ప్రభుత్వం........

Published : 07 Aug 2020 22:57 IST

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో మూడు రోజుల క్రితం జరిగిన భీతావహ ఘటనకు కారణాలు విశ్లేషించే పనిలో అక్కడి ప్రభుత్వం నిమగ్నమైంది. ఎంతో కాలంనుంచి అధిక మొత్తంలో నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్ ఈ పేలుడు కారణమని ఆ దేశ ప్రధాని హసాన్‌ దియాబ్ స్వయంగా వెల్లడించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం లెబనాన్ అధ్యక్షుడు మిచెల్‌ ఆవున్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుళ్ల ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, నిర్లక్ష్యం కారణంగానా? ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే అనుమానాలను వ్యక్తంచేసినట్టు స్థానిక మీడియా పేర్కొంది.

‘‘అసలు కారణం ఏంటనేది ఇప్పటివరకు తెలియలేదు. బయటి వ్యక్తులు ఎవరైనా రాకెట్‌ లేదా బాంబుతో దాడి చేసి ఉండొచ్చు. దీనికి సంబంధించిన దర్యాప్తు మూడు దశల్లో జరుగుతుంది. ఈ ఘటనలో పేలుడు స్వభావం కలిగిన పదార్థం ఎలా లోపలికి వెళ్లిందనేది తొలి అంశం కాగా.. రెండోది పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందా లేక నిర్లక్ష్యం వల్లా? అనేది. ఇక మూడోది ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా?’’ అనే కోణంలో విచారించబోతున్నట్లు తెలిపారు.

మూడు రోజుల క్రితం లెబనాన్‌ రాజధాని బీరుట్‌ ఓడ రేవులో నిల్వ ఉంచిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలడంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో గాయపడ్డారు. దాదాపు రూ.1.12 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా. పేలుడు శబ్దాలు సుమారు 200 కిలోమీటర్లు దూరం వినిపించాయంటే తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన తమకు సహాయం చేయాలని ఆ దేశ ప్రధాని మిత్ర దేశాలను అభ్యర్థించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని