ఐసోలేషన్‌లో కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అంతకుముందు హోం మంత్రి అమిత్‌షాని కలవడంతో..

Published : 03 Aug 2020 16:38 IST

హోం క్వారంటైన్‌లోకి మరికొందరు మంత్రులు

దిల్లీ: కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అంతకుముందు హోం మంత్రి అమిత్‌షాని కలవడంతో న్యాయశాఖ మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం అమిత్‌షా తనకు కరోనా సోకిందని ప్రకటించే ముందు రోజు శనివారం ఆయనను కలిసినట్లు రవిశంకర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రభుత్వ నియమావళి ప్రకారమే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు న్యాయశాఖ మంత్రి ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. కొద్దిరోజుల ముందే తన సిబ్బందికి వైరస్‌ సోకగా రవిశంకర్‌ సైతం పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు ఆయనకు నెగెటివ్‌గా వచ్చింది.

మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ముందున్న హోంమంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. తనకు వ్యాధి సోకినట్లు ఆయన ఆదివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. తాను క్షేమంగానే ఉన్నట్లు వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. తనతో కాంటాక్ట్‌లో ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకోవాలని, ఐసోలేట్‌ కావాల్సిందిగా ఈసందర్భంగా కోరారు. కాగా హోంమంత్రి త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖులు ట్వీట్లు చేశారు. త్వరగా కోలుకోవాంటూ రవిశంకర్‌ ప్రసాద్‌ సైతం కోరారు. ఆదివారం షాను కలిసిన కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో కూడా వైద్యుల సలహా మేరకు  ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు ప్రకటించారు. బుధవారం జరిగిన క్యాబినెట్‌ మీటింగ్‌లో అమిత్‌షాతో పాటు పాల్గొన్న మంత్రి గజేంద్ర షెకావత్‌ సైతం హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని