భూటాన్‌కు అండగా భారత్‌: మోదీ

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న క్లిష్ట సమయంలో భూటాన్‌కు భారత్‌ అండగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు.

Updated : 20 Nov 2020 17:35 IST

రూపే కార్డు ఫేజ్‌-2 ప్రారంభం సందర్భంగా ప్రధాని

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో భూటాన్‌కు భారత్‌ అండగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. పొరుగుదేశాల అవసరాలను తీర్చడాన్ని భారత్‌ అత్యంత ప్రాధాన్య విషయంగా భావిస్తుందని పేర్కొన్నారు. భూటాన్‌ వాసులు భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించే రూపే ఫేజ్‌-2 కార్యక్రమాన్ని ఇరు దేశాల ప్రధానులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారాన్ని ప్రధాని మోదీ అభినందించారు.

ముఖ్యంగా భూటాన్‌ ఉపగ్రహాన్ని ఇస్రో సహాయంతో నింగిలోకి పంపించే ఏర్పాట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం వంటి అంశాల పురోగతిని మోదీ గుర్తుచేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భూటన్‌ ప్రధాని లొటాయ్‌ షెరింగ్‌ పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతోపాటు వివిధ అంశాల్లో భారత్‌ సహకారం ఎంతో అభినందనీయమని భూటాన్‌ ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రూపే కార్డు ప్రాజెక్టు ఫేజ్‌-1ను గత సంవత్సరం మోదీ భూటాన్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రారంభించారు. మొదటి దశలో భాగంగా, భారత్‌ నుంచి భూటాన్‌ వెళ్లే పర్యాటకులు అక్కడి ఏటీఎం, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) మిషన్లతో రూపే కార్డులతో చెల్లించే సౌకర్యాన్ని కల్పించారు. తాజాగా ఫేజ్‌-2లో భాగంగా భారత్‌కు వచ్చే భూటాన్‌ వాసులకు ఈ కార్డులను యాక్సెస్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు.

ఇవీ చదవండి..
భూటాన్‌ భూభాగంలో చైనా హల్‌చల్‌
రెమిడెసివిర్‌తో ప్రయోజనం లేదు: డబ్ల్యూహెచ్‌వో


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని