సైనికులకు మద్దతుగా దీపాలు వెలిగించండి:మోదీ

సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ.. శత్రువుల బారినుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతోన్న సైనికుల సేవలు, ధైర్య సాహసాలను పండుగ సమయంలో మరోసారి గుర్తుచేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 25 Oct 2020 13:38 IST

దిల్లీ: సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ.. శత్రువుల బారినుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతోన్న సైనికుల సేవలు, ధైర్య సాహసాలను పండుగ సమయంలో మరోసారి గుర్తుచేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీపావళి, ఈద్‌ వంటి పండుగల సమయంలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సరిహద్దులను, మనల్ని సురక్షితంగా కాపాడుతోన్న సైనికులను గుర్తు చేసుకోవాలని కోరారు. ఇలాంటి సమయంలో సైనికులు, భద్రతా దళాలకు యావత్‌ దేశప్రజలు మద్దతుగా ఉన్నామని గుర్తుచేస్తూ పండుగరోజు తమతమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈవిధంగా స్పందించారు. ప్రతినెల రేడియా ద్వారా నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.

కరోనావైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. పండుగలు జరుపుకొనేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని దేశప్రజలకు ప్రధానమంత్రి సూచించారు. అంతేకాకుండా, కరోనావైరస్‌పై జరుగుతోన్న పోరులో తప్పకుండా విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తంచేశారు. పండుగల సమయంలో స్వదేశీ వస్తువులను కొనడానికే మొగ్గు చూపాలని.. ముఖ్యంగా స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో కశ్మీర్‌ లోయలోని పుల్వామా ప్రాంతం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశానికి అవసరమయ్యే పెన్సిల్‌ కలపలో 90శాతం ఇక్కడ నుంచే తయారవుతోందని గుర్తుచేశారు. ప్రస్తుతం అక్కడి కొన్ని గ్రామాలను పెన్సిల్‌ గ్రామాలుగా పిలుస్తున్నారని తెలిపారు. కృషితోపాటు స్వదేశీకి ప్రాధాన్యత ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందన్నారు.

వీటితోపాటు దేశాన్ని ఐక్యం చేసి ముందుకు నడిపించడంలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటివాటిలో భక్తిఉద్యమం పాత్ర ఎనలేనిదని గుర్తుచేశారు. త్రిపుర నుంచి గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌ నుంచి తమిళనాడు వరకు ప్రజల విశ్వాసాలకు ప్రతీకలుగా ఉన్న పుణ్యక్షేత్రాలు యావత్‌ దేశాన్ని ఒక్కతాటిపై నడిపిస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే భక్తిఉద్యమం భారత్‌లోనే అతిపెద్ద ప్రజా ఉద్యమంగా మారి యావత్‌ దేశ ప్రజలను ఏకం చేసిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు