ఆ చర్యలే చైనాను వణికించాయ్‌: నడ్డా

భారత్‌- చైనా సరిహద్దుల్లో రహదారుల నిర్మాణంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత్‌ చేపట్టిన ఈ చర్యలవల్లే చైనా వెన్నులో వణుకుపుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని 6 పార్టీ ఆఫీసులకు ఏకకాలంలో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన  శంకుస్థాపన...

Published : 22 Oct 2020 20:15 IST

సిమ్లా: భారత్‌- చైనా సరిహద్దుల్లో రహదారుల నిర్మాణంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత్‌ చేపట్టిన ఈ చర్యలవల్లే చైనా వెన్నులో వణుకుపుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరుచోట్ల నిర్మించనున్న పార్టీ ఆఫీసులకు ఏకకాలంలో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. గడిచిన ఆరేళ్లలో ప్రధాని మోదీ హయాంలో లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు దాదాపు 4,700 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారులను కేంద్రం నిర్మించిందన్నారు. అంతేకాకుండా ఆర్మీ ట్యాంకర్లు పోయేందుకు వీలుగా 14.7 కి.మీ మేర వంతెనలు నిర్మించామన్నారు. 

గతంలో అత్యంత కీలక ప్రదేశాల్లోనూ చిన్న పాటి వంతెనలు ఉండేవని, వాటి ద్వారా ఆర్మీ ట్యాంకర్లు వెళ్లేందుకు వీలుపడేది కాదనినడ్డా అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రోహ్‌తంగ్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్‌ టన్నెల్‌ అంశాన్ని నడ్డా ప్రస్తావించారు. పిర్‌పంజల్‌ పర్వత శ్రేణిలో నిర్మించిన  అత్యంత పొడవైన ఈ సొరంగ మార్గమిది. 2013-14 నాటికి కేవలం 1300 మీటర్ల మేర మాత్రమే ఈ సొరంగ నిర్మాణం జరిగింది. 2014లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ సొరంగ మార్గం వల్ల హిమాచల్‌ ప్రజలకే కాకుండా లేహ్‌-లద్దాఖ్‌లకు కూడా ఈ మార్గం ఎంతో ప్రయోజనకరం. నిజానికి ఈ కార్యక్రమానికి కూడా తాను రావాల్సి ఉందని, అయితే బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నందున రాలేకపోయానని వివరించారు. ఈ సొరంగ మార్గం వల్ల దేశ భద్రతకు ఎంతో మేలు కలుగుతుందని నడ్డా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని