మోదీ, అయోధ్య, మూడు రికార్డులు!

అయోధ్య కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా ప్రధాని మోదీ ఒకే రోజు మూడు రికార్డులు సృష్టించటం గమనార్హం.

Updated : 21 Nov 2022 16:53 IST

అయోధ్య: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామజన్మభూమి అయోధ్యలో నేడు రామ మందిర నిర్మాణానికి సబంధించిన భూమిపూజా కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా ప్రధాని ఒకే రోజు మూడు జాతీయ రికార్డులు సృష్టించటం గమనార్హం. నేటి కార్యక్రమం ద్వారా అయోధ్యలో రామమందిరాన్ని దర్శించిన తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. మహిమాన్వితమైనదిగా భావించే ఇక్కడి హనుమాన్‌ గడి మందిరాన్ని దేశ ప్రధానమంత్రి దర్శించటం కూడా ఇదే తొలిసారి. ఇక దేశ సంస్కృతి పరిరక్షణకు చిహ్నంగా భావిస్తున్న దేవాలయ భూమిపూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనటం ఇదే ప్రథమం కావటం ముచ్చటగా మూడవ రికార్డు. 

28 సంవత్సరాల అనంతరం మోదీ అయోధ్యను దర్శించటం ఇదే తొలిసారి. డిసెంబర్‌ 1991లో నాటి భాజపా అధ్యక్షుడు మురళీ మనోహర్‌ జోషీ ఆర్టికల్‌ 370 రద్దును కోరుతూ దేశవ్యాప్త తిరంగా యాత్రను ప్రారంభించారు. జనవరి 18, 1992న అయోధ్యకు చేరుకున్న ఈ యాత్రలో మోదీ పాల్గొని అక్కడి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఇక్కడి శ్రీ రాముడి విగ్రహాన్ని కూడా దర్శించుకున్నారు. కాగా, నేడు సదరు ఆర్టికల్‌ 370 రద్దు చేసి నేటికి సరిగ్గా ఒక సంవత్సరం కావటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని