Updated : 27 Dec 2020 16:05 IST

2021కి మోదీ సూచించిన తీర్మానాలు..

దిల్లీ: భారత యువతను చూసినప్పుడల్లా తనలో భరోసా పెరుగుతుందని, మనసు ఉల్లాసంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏదైనా సాధించగలం, చేయగలమన్న వారి సంకల్పం స్ఫూర్తినిస్తుందన్నారు. ఎంతటి సవాలైనా వారి ముందు చిన్నదే అని వ్యాఖ్యానించారు. వారి వల్ల సాధ్యం కానిది ఏదీ లేదంటూ దేశ యువతలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని తన మనోగతాన్ని పంచుకున్నారు. స్వయం సమృద్ధి, భారత్‌లో తయారీ వంటి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇదే చివరి మన్ కీ బాత్‌ కావడం గమనార్హం.

2021వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో భారత్‌ను సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రహిత దేశంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ తీర్మానించుకోవాలని సూచించారు. అలాగే దేశీయంగా తయారైన వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశంలో తయారీదారులంతా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి కంకణం కట్టుకోవాలని కోరారు. 2020లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. అయినా, ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలిపారు. ప్రతి సవాల్‌ నుంచి ఓ పాఠం నేర్చుకున్నామన్నారు. స్వయం సమృద్ధిపై దృష్టి సారించామన్నారు. దిల్లీలోని ఝందేవాలా మార్కెట్‌లో ఒకప్పుడు విదేశీ ఆటవస్తువులే ఎక్కువగా ఉండేవని.. ఇప్పుడు కేవలం దేశీయంగా తయారైన ఆటబొమ్మలే విక్రయిస్తున్నారని తెలిపారు.

దేశ ప్రజలు స్థానిక వస్తువులకే అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తిదారులు, పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వస్తువుల తయారీపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు సిక్కు సాధువులు, మతగురువుల త్యాగాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. నలుగురు సాహిబ్‌జాదే, మాతా గుజ్రీ, గురు తేగ్‌ బహదూర్, గురు గోవింద్ సింగ్‌ వంటి వారి త్యాగాలకు మనమంతా ఎంతో రుణపడి ఉన్నామన్నారు. కొత్త సాగు చట్టాల రద్దే లక్ష్యంగా దిల్లీ సరిహద్దుల్లో పంజాబీ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిక్కు సాధువుల త్యాగాలను మోదీ స్మరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మోదీ ప్రసంగంలోని మరిన్ని కీలకాంశాలు..

* 2014-18 మధ్య చిరుతపులుల జనాభా 60శాతం పెరిగింది. ఒకప్పుడు దేశంలో 7,900 చిరుతలు ఉండేవి. 2019 నాటికి అవి 12,852కు పెరిగాయి. మధ్య భారతదేశంలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే తరహాలో సింహాలు, పులుల సంఖ్య సైతం పెరిగింది. ప్రభుత్వంతో పాటు పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థల సహకారం వల్లే ఇది సాధ్యమైంది.

* దైనందిన జీవితంలో మనం వాడుతున్న వస్తువుల్లో విదేశాల్లో తయారవుతున్నవి ఏవో గుర్తించండి. వాటికి దేశీయ ప్రత్యామ్నాయాలేంటో కనిపెట్టి వాటినే వాడేందుకు తీర్మానించుకోండి.

* కశ్మీరీ ‘కేసరి’కి ఈ ఏడాది జీఐ ట్యాగ్‌ లభించింది. ఇక దీన్ని అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటాం.

ఇవీ చదవండి..

పాక్‌ను ఇప్పుడేమనాలి..!

వింగ్‌లూంగ్.. తొంగిచూస్తే కూల్చేస్తాం..!


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని