ఔషధం వచ్చేవరకూ అజాగ్రత్త వద్దు..! మోదీ

దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు.

Published : 13 Oct 2020 15:11 IST

కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదన్న ప్రధానమంత్రి

దిల్లీ: దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ, మహారాష్ట్రలో వైరస్‌ తీవ్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధం వచ్చేవరకు వైరస్‌పై అజాగ్రత్త వద్దని సూచించారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

‘కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదు. మహారాష్ట్రలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ సమయంలో ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి..‘ఔషధం వచ్చేవరకు అజాగ్రత్త వద్దు’ అని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. డాక్టర్‌ బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌ ‘ఆత్మకథ’ను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ విధంగా స్పందించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా పాల్గొన్నారు.

ఇదిలాఉంటే, దేశంలో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుతున్నప్పటికీ మహారాష్ట్రలో వైరస్‌ తీవ్రత ఆందోళనకరంగానే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కేసుల సంఖ్య 15లక్షలు దాటగా వీరిలో 12లక్షల 80వేల మంది కోలుకున్నారు. మరో 2లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధిక కొవిడ్‌ మరణాలు ఇక్కడే చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 9వేల మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా, కేవలం మహారాష్ట్రలోనే 40,514మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని