మాస్కోలో మాస్‌ వ్యాక్సినేషన్‌ ఆరంభం

ప్రపంచంలోనే మొదటి టీకాను రిజిస్టర్ చేసి రష్యా ఆశ్చర్యపర్చగా..ఇప్పుడు ఆ దేశ రాజధాని మాస్కో మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

Published : 06 Dec 2020 02:40 IST

మాస్కో: ప్రపంచంలోనే మొదటి కరోనా టీకా నమోదు చేసిన ఆశ్చర్యపరిచిన రష్యా ఇప్పుడు ఆ దేశ రాజధాని మాస్కోలో మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. 70 ఆస్పత్రులను ఏర్పాటు చేసి ‘స్పుత్నిక్‌-వి’ టీకా డోసులను ఇస్తున్నామని అక్కడి కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. వైరస్‌కి ఎక్కువ ప్రభావితమయ్యే వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలకు మొదట ఈ టీకా అందుబాటులో ఉంటుందన్నారు.

‘మీరు ఒక విద్యాసంస్థలో పనిచేస్తుంటే.. కొవిడ్-19 ప్రాధాన్య క్రమంలో మీరు ముందుంటారు. అది కూడా ఉచితంగా’ అంటూ ఓ పాఠశాల ఉపాధ్యాయుడికి శనివారం సందేశం వచ్చిందని అక్కడి మీడియా సంస్థ పేర్కొంది. అలాగే మొదటి ఐదు గంటల్లో ఉపాధ్యాయులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు ఇలా సుమారు 5,000 మంది టీకా కోసం నమోదు చేసుకున్నారని శుక్రవారం ఆ నగర మేయర్ వెల్లడించారు. 60 సంవత్సరాల వయసు పరిమితిని విధించడంతో పాటు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, గర్భిణులు, రెండు వారాలుగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిని ఈ టీకా కార్యక్రమానికి దూరంగా ఉంచారు. అలాగే 21 రోజుల వ్యవధిలో రెండు డోసులుగా టీకాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. తాము రెండు కొవిడ్-19 టీకాలను అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటించింది. స్పుత్నిక్‌ టీకాకు డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ నిధులు సమకూరుస్తుండగా.. సైబీరియాకు చెందిన వెక్టర్ ఇనిస్టిట్యూట్ మరో టీకాను అభివృద్ధి చేసింది. కానీ, ఈ రెండు టీకాలకు తుది దశ ట్రయల్స్ పూర్తి కాకపోవడం గమనార్హం. మరోవైపు  రష్యాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం నాటికి దేశ రాజధాని నగరం మాస్కోలో 7,993 కొత్త కేసులు నమోదు కాగా, దేశ వ్యాప్తంగా 28,782 మంది వైరస్ బారిన పడ్డారు. 24,31,731 పాజిటివ్‌ కేసులతో ప్రపంచ వ్యాప్తంగా రష్యా నాలుగో స్థానంలో ఉంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని