సీమాంతర ఉగ్రవాదమే అసలైన సవాల్‌!

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటొన్న అతి ముఖ్యమైన సవాల్‌ ఉగ్రవాదమేనని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి స్పష్టంచేశారు.

Updated : 01 Dec 2020 05:19 IST

షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత ఉపరాష్ట్రపతి

దిల్లీ: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటోన్న అతి ముఖ్యమైన సవాల్‌ ఉగ్రవాదమేనని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి స్పష్టంచేశారు. ఈ ముప్పు తొలగిపోతేనే ఆర్థిక రంగంతో పాటు దేశాల వాస్తవ సామర్థ్యాలు బయటపడతాయని అభిప్రాయపడ్డారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన, ఇలాంటి బెదిరింపు విధానాలను కలసికట్టుగా ఎదుర్కోవాలని ఎస్‌సీఓ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన, కొన్నిదేశాలు వ్యూహాత్మకంగా అనుసరిస్తోన్న సీమాంతర ఉగ్రవాదం చాలా ఆందోళనకు గురిచేస్తోందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ఎస్‌సీఓ వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా ఇరుదేశాలకు చెందిన ద్వైపాక్షిక అంశాలను ప్రస్తావిస్తోన్న పాకిస్థాన్‌ తీరును ఆయన మరోసారి తప్పుబట్టారు. ఇలాంటి చర్యలు సదస్సు నియమ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు.

ఇక, సెప్టెంబర్‌లో జరిగిన సదస్సులోనూ కశ్మీర్‌ మ్యాప్‌ను తప్పుగా చూపించిన పాకిస్థాన్,‌ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. దీన్ని తీవ్రంగా ఖండించిన భారత్‌..ఆ సమావేశం నుంచి బయటకు వచ్చింది. అప్పుడు భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోబాల్‌ ఆ సమావేశాన్ని బహిష్కరించారు. ఇదిలాఉంటే, ఎస్‌సీఓ కూటమిలో శాశ్వత సభ్యత్వం తర్వాత తొలిసారిగా ఈ సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహిస్తోంది. అయితే, కరోనా కారణంగా ఈసారి వర్చువల్ పద్ధతిలో ఎస్‌సీఓ సదస్సును నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని