అక్కడ ఈ ఏడాది మూడో సూర్యోదయం..!

భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో ఈ ఏడాది మూడోసారి సూర్యోదయమైంది. ఉగ్రవాద చీకట్లను తరిమికొట్టింది. ఈ సారి భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ది నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాల్యాండ్‌-ఖప్లాంగ్‌(ఎన్‌ఎస్‌సీఎన్‌-ఓకై) ఉగ్రస్థావరాలపై మయన్మార్‌ సైన్యం విరుచుకుపడింది.

Updated : 27 Oct 2020 14:24 IST

 ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 

భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో ఈ ఏడాది మూడోసారి సూర్యోదయమైంది. ఉగ్రవాద చీకట్లను తరిమికొట్టింది. ఈ సారి భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ‘ది నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాల్యాండ్‌-ఖప్లాంగ్’‌(ఎన్‌ఎస్‌సీఎన్‌-ఓకై) ఉగ్రస్థావరాలపై మయన్మార్‌ సైన్యం విరుచుకుపడింది.  యుంగ్‌ ఔంగ్‌ నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్‌ఎస్‌సీఎన్‌ ఈశాన్య భారత్‌లో పనిచేస్తున్న భద్రతా దళాలపై దాడులకు కుట్రలు పన్నుతోంది. అంతేకాదు మయన్మార్‌లో భారత్‌ చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు అడ్డంకిగా మారింది.

భారత ఆర్మీచీఫ్‌ వెళ్లిన నెలలోనే..

భారత ఆర్మీచీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్‌ ష్రింగ్లాలు అక్టోబర్‌ మొదటి వారంలో మయన్మార్‌లో పర్యటించారు. ఈ పర్యటనకు చాలా ప్రాధాన్యం ఉంది. ఓ పక్క చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పుడు ఆర్మీచీఫ్‌ విదేశీ పర్యటనకు వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. మయన్మార్‌లో ఉగ్రవాదానికి చైనా ఊతం ఇస్తోందని స్వయంగా గత జులైలో ఆ దేశా ఆర్మీ జనరల్‌ మిన్‌ ఆంగ్‌ హ్లాయింగ్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదులకు కూడా చైనా అండదండలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌-మయన్మార్‌లో వేర్పాటు వాదానికి కారణమవుతున్న వారిపై సంయుక్తంగా చర్యలు తీసుకొనే అంశంపై చర్చించారు.  ఇది జరిగిన నెలలోపే ‘ఆపరేషన్‌ సన్‌రైజ్‌-3’ మొదలు కావడం విశేషం.

సగైంగ్‌ డివిజన్‌లో..

మయన్మార్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక సైనిక బృందాలు భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఎన్‌ఎస్‌సీఎన్‌-కె, ఇతర గ్రూపులు ఎక్కువగా తలదాచుకొనే సగైంగ్‌ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌లు చేపట్టాయి. మణిపూర్‌ను ఆనుకొని ఉన్న సరిహద్దుల్లో పదాతి దళాలు ఆపరేషన్‌ చేపట్టినట్లు భారత్‌కు చెందిన సైన్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆపరేషన్‌ సన్‌రైజ్‌ సగైంగ్‌ డివిజన్‌లోనే కేంద్రీకృతమైంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లోని వేర్పాటువాదులు ఇక్కడ పోగవుతున్నట్లు సమాచారం ఉంది. వీరంతా మిజోరాం నుంచి భారత్‌లోకి చొరబడేందుకు కుట్రలు పన్నుతున్నారు.

 మూడోసారి..

 సన్‌రైజ్‌ పేరుతో ఆపరేషన్‌ చేపట్టడం ఇది మూడోసారి. గత ఫిబ్రవరి 17 నుంచి మార్చి 2వ తేదీ మధ్యలో మూడురోజులపాటు ఇరుదేశాల సైన్యాలు సమన్వయంతో ఆపరేషన్‌ సన్‌రైజ్-1 నిర్వహించాయి. గతేడాది మే 16న ఇరు దేశాలు ఎవరి భూభాగాల్లో వాళ్లు ఒకేసారి ఆపరేషన్‌ సన్‌రైజ్‌-2 నిర్వహించాయి. దీనిలో భారీ సంఖ్యలో వేర్పాటువాదుల స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌ రెండోదశలో మయన్మార్‌ సైనికులు 13 మంది కూడా మృతి చెందారు. ఈ ఆపరేషన్‌ జరిగినప్పటికీ మయన్మార్‌లోని అరాకాన్‌ ఆర్మీ మిజొరామ్‌లోని లాంగట్లాయి జిల్లాలో స్థావరాలు ఏర్పాటు చేసింది. ఇది భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన కళాదాన్‌ ప్రాజెక్టుకు ముప్పుగా పరిణమించింది. ఈశాన్య రాష్ట్రాలకు సరఫరాలను చేసే సిలుగురి కారిడార్‌కు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును భావిస్తున్నారు. మిజోరాంను సిథ్వే నౌకాశ్రయానికి అనుసంధానిస్తూ దీనిని చేపట్టారు. ఈ అరాకాన్‌ ఆర్మీకి చైనా మద్దతు ఉందని జులైలో మయన్మార్‌ మిలటరీ బ్రిగేడియర్‌ జనరల్‌ జా మిన్‌ తున్‌ పేర్కొన్నారు. వీరి వద్ద అత్యంత ఖరీదైన ఆయుధాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. మరోవైపు నుంచి కూడా ముప్పు రాకుండా మయన్మార్‌-భారత్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌  చేపట్టినట్లు సమాచారం.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని