కొవిడ్‌ ఆంక్షలు‌: 20శాతం తగ్గిన కాలుష్యం!

కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం కాలుష్యం తగ్గినట్లు నాసా వెల్లడించింది.

Published : 19 Nov 2020 19:42 IST

నాసా నివేదికలో వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా కారణంగా యావత్‌ ప్రపంచ దేశాలు ఆంక్షల బాటపట్టాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ ఆంక్షలతో ఆయా ప్రాంతాల్లో భారీస్థాయిలో కాలుష్యం తగ్గింది. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకం లేకపోవడం వల్ల కాలుష్యస్థాయి భారీగా తగ్గినట్లు నాసా పరిశోధకులు గుర్తించారు. కేవలం లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు 20శాతం కాలుష్యం తగ్గినట్లు వెల్లడించారు.

కరోనా కట్టడిలో భాగంగా ప్రపంచం మొత్తం ఆంక్షలు విధిస్తోన్న వేళ.. పరిశ్రమలు, రవాణా వాహన ఇంధనాల వినియోగం తగ్గింది. దీంతో, వీటినుంచి వెలుబడే కాలుష్యం కూడా భారీగానే తగ్గింది. అయితే, వీటి స్థాయిలను అంచనా వేసేందుకు నాసా పరిశోధకులు మాథమెటికల్‌ మోడెల్‌ను వినియోగించారు. 46 దేశాల్లోని వాతావరణ సమాచారాన్ని ప్రతి గంట గంటకు సేకరించారు. ఇలా 61 నగరాల సమాచారాన్ని సేకరించగా వీటిలో 50 నగరాల్లో నైట్రోజన్ ‌డైయాక్సైడ్‌ పరిమాణం దాదాపు 20 నుంచి 50శాతానికి తగ్గినట్లు గుర్తించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో దాదాపు 20శాతం నైట్రోజన్‌ డైయాక్సైడ్‌ సాంద్రత తగ్గినట్లు నాసా పరిశోధకులు కనుగొన్నారు. కరోనా వైరస్ తొలిసారిగా బయటపడిన వుహాన్‌లో నైట్రోజన్ ‌డైయాక్సైడ్‌ భారీ స్థాయిలో తగ్గినట్లు గుర్తించారు. సాధారణ పరిస్థితులతో పోలిస్తే, ఇక్కడ దాదాపు 60శాతం తగ్గినట్లు తేల్చారు. అంతేకాకుండా, అమెరికాలోని న్యూయార్క్‌(45శాతం), ఇటలీలోని మిలాన్‌(60శాతం) నగరాల్లోనూ భారీగా కాలుష్య స్థాయిలు తగ్గిపోయానని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

‘సాధారణ సీజన్లలో ఉండే వాతావరణ మార్పులతో పోలిస్తే లాక్‌డౌన్‌ సమయంలో ఎంత మేరకు కాలుష్యం తగ్గిందని కచ్చితంగా కొలువడం సాధ్యమయ్యే విషయం కాదు. కానీ, గాలి నాణ్యతపై లాక్‌డౌన్‌ల ప్రభావం తప్పకుండా ఉంటుంది’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన క్రిస్టోప్‌ కెల్లెర్‌ అభిప్రాయపడ్డారు. సాధారణ రోజుల్లో కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఈ స్థాయిలో కాలుష్య నియంత్రణ సాధ్యం కాలేదని అన్నారు.

ఇదిలాఉంటే, అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా సాధారణ స్థితికి వస్తోన్న దేశాల్లో మాత్రం మళ్లీ కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇలాంటి భిన్న వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కాలుష్య తీవ్రతపై నాసా పరిశోధన చేపట్టింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని