నీట్‌, జేఈఈ .. మార్గదర్శకాలివే..

కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది.

Updated : 26 Aug 2020 20:24 IST

దిల్లీ: జులైలో జరగాల్సిన జాతీయ స్థాయి వైద్య విద్య, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు నీట్‌, జేఈఈ.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. కాగా, ఈ పరీక్షల నిర్వహణ తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టీఏ) ఇటీవల ప్రకటించింది. జేఈఈ ప్రాథమిక పరీక్ష (మెయిన్) సెప్టెంబర్‌ 1 నుంచి 6 వరకు.. నీట్‌ (యూజీ) పరీక్షను సెప్టెంబర్‌ 13న నిర్వహించనుంది. ఈ క్రమంలో జేఈఈ హాల్‌టికెట్లు ఇప్పటికే విడుదల కాగా, నీట్‌ అడ్మిట్‌కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. అంతేకాకుండా ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు మార్గదర్శకాలను కూడా సంస్థ నిర్దేశించింది.

*విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటించాలి.

*పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు ధరించేందుకు అనుమతి ఉంది. వాటిని తెచ్చుకోని విద్యార్థులకు నిర్వాహకులే అందజేస్తారు.

*ప్రతి కేంద్రం వద్ద శానిటైజర్‌ ఏర్పాటు ఉంటుంది.

*డెస్కులు, టేబుళ్లు, డోర్‌ హ్యాండిల్‌ వంటివి క్రిమిరహితం చేసేందుకు స్ప్రే బాటిళ్లు, స్పాంజ్‌ లేదా వస్త్రాన్ని అందుబాటులో ఉంచుతారు.

*పరీక్షా కేంద్రం ప్రవేశ ద్వారాల వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించే థెర్మోగన్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

*తనిఖీ సమయంలో విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరు వరుసలు ఉంటాయి. ఒకసారి 20 మందికి మాత్రమే వరుసలో అనుమతి ఉంటుంది.

*కొవిడ్‌ నేపథ్యంలో..ఈసారి వ్యక్తిగతంగా తనిఖీ విధానం ఉండదు. పెద్ద హ్యాండిల్‌ గల మెటల్‌ డిటెక్టర్‌ ద్వారా అభ్యర్థుల తనిఖీ నిర్వహిస్తారు.

అంతేకాకుండా దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షా కేంద్రాల సంఖ్యను 570 నుంచి 660కి.. నీట్‌ పరీక్షా కేంద్రాల సంఖ్య 2546 నుంచి 3843కు పెంచినట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. భౌతిక దూరం నిబంధనకు అనుగుణంగా.. జేఈఈలో విద్యార్థులకు వరుస విడిచి వరుసలో సీట్లు కేటాయించగా, నీట్‌ విద్యార్థులు గదికి కేవలం 12 మందే ఉంటారని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని