Published : 20 Oct 2020 01:07 IST

బెన్నుపై నాసా కన్ను!

గ్రహశకలం నుంచి నమూనాల సేకరణకు సర్వం సిద్ధం
ఉపరితలంపై దిగనున్న ఒసైరిస్‌-రెక్స్‌ వ్యోమనౌక 

కేప్‌ కెనావెరాల్‌: భూమి నుంచి లక్షల మైళ్ల దూరంలో ఉన్న ఒక పురాతన గ్రహశకలం నుంచి నమూనాలు సేకరించేందుకు అమెరికా రంగం సిద్ధం చేసింది. వాటిని భూమికి తీసుకొచ్చి, గ్రహశకలాలు, విశ్వం గురించి మరిన్ని అంశాలను వెలుగులోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకూ జపాన్‌ మాత్రమే ఈ ఘనతను సాధించింది. 
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన ‘ఒసైరిస్‌-రెక్స్‌’ వ్యోమనౌక ‘బెన్ను’ అనే గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తోంది. మంగళవారం ఇది కిందకి దిగి.. ఆ ఖగోళ వస్తువు నుంచి దాదాపు 60 గ్రాముల నమూనాలను సేకరిస్తుంది. ఇందుకోసం బెన్నుపై టెన్నిస్‌ కోర్టు పరిమాణంలో ఉన్న ఒక ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. దానికి నైటింగేల్‌ అని పేరు పెట్టారు. ఒసైరిస్‌-రెక్స్‌ ప్రస్తుతం బెన్నుకు 0.75 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అక్కడి నుంచి కిందకి దిగి, నమూనాలను సేకరించడానికి ఈ వ్యోమనౌకకు నాలుగు గంటలు పడుతుంది. గ్రహశకల ఉపరితలంపై అది 5-10 సెకన్లు మాత్రమే ఉంటుంది. నమూనాల సేకరణ కోసం అది.. పీడనంతో కూడిన నైట్రోజన్‌ గ్యాస్‌ను తొలుత బయటకు విడుదల చేస్తుంది. ఫలితంగా పైకి లేచే ధూళి, గ్రావెల్‌ను తనలోకి లాగేసుకొని, వేగంగా పైకి లేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తాన్నీ వ్యోమనౌక సొంతంగానే నిర్వహిస్తుంది. భూమి నుంచి దాన్ని నియంత్రించడం  కుదరదు. ఇక్కడి నుంచి వెళ్లే సంకేతం.. ఆ వ్యోమనౌకను చేరుకోవడానికి 18 నిమిషాలు పట్టడమే ఇందుకు కారణం. ఒకవేళ తొలి ప్రయత్నంలో విఫలమైతే.. మరోసారి నమూనాల సేకరణకు ఒసైరిస్‌ రెక్స్‌ ప్రయత్నిస్తుంది. ఈ నమూనాలు 2023లో భూమికి చేరుకుంటాయి.
80 కోట్ల డాలర్లు.. 
ఒసైరిస్‌-రెక్స్‌ పొడవు 2.3 మీటర్లు. ఇది వ్యాన్‌ పరిమాణంలో ఉంటుంది. 80 కోట్ల డాలర్ల విలువైన ఈ వ్యోమనౌకను 2016లో నాసా ప్రయోగించింది. బెన్నుపై ఇసుక ఉంటుందని తొలుత ఆ సంస్థ అంచనావేసింది. ఈ మేరకు 2 సెంటీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే చిన్నపాటి రాళ్లను మాత్రమే సేకరించేలా ఒసైరిస్‌-రెక్స్‌ను రూపొందించారు. అయితే 2018లో ఆ ఖగోళ వస్తువు వద్దకు వ్యోమనౌక చేరాక అసలు విషయం బయటపడింది. అక్కడ భారీ శిలలు, గులకరాళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రహశకలంపై తీవ్రంగా గాలించి, ‘నైటింగేల్‌ బిలాన్ని’ నాసా శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. అక్కడ చిన్నపాటి రేణువులు ఎక్కువగా ఉన్నాయి. భారీ శిలలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ల్యాండింగ్‌ ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కిందకు దిగాక.. పడిపోయే ప్రమాదం ఉందని భావిస్తే వ్యోమనౌక తిరిగి నింగిలోకి దూసుకెళుతుంది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts