నివర్ అలెర్ట్‌: 30 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం!

‘నివర్‌’ అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 22 బృందాలను సిద్ధంగా ఉంచింది. ఈ మేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌, వాతావరణ శాఖ డీజీ మృత్యుంజయ .........

Updated : 24 Nov 2020 21:02 IST

దిల్లీ: ‘నివర్‌’ అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 22 బృందాలను సిద్ధంగా ఉంచింది. ఈ మేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌, వాతావరణ శాఖ డీజీ మృత్యుంజయ మహాపాత్ర సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. తుపాను గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ వెల్లడించారు. దీని ప్రభావం ఉండే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. భారత వాతావరణ శాఖ సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అవసరాలను బట్టి మొత్తం 22 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. వీటిలో 12 బృందాలు తమిళనాడు, మూడు బృందాలు పుదుచ్చేరి, ఏడు బృందాలను ఏపీలో ఇప్పటికే మోహరించామన్నారు. అదనపు అవసరాల కోసం మరో 8 బృందాలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. మొత్తంగా 30 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశామన్నారు. ఈ‌ బృందాల వద్ద సహాయక చర్యలకు అవసరమైన పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు కూడా ఉన్నట్టు చెప్పారు. 

జనానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ భరోసా

తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్న అన్ని జిల్లాలు, స్థానిక అధికారులతో ఎన్డీఆర్‌ఎఫ్‌ చాలా దగ్గరగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తోందని సంబంధిత‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాని వెల్లడించారు. తుపానులకు సంబంధించిన సమాచారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వివరిస్తున్నామన్నారు. అలాగే, ఆయా ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేందుకు స్థానిక అధికారులకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహకరిస్తున్నారన్నారు. సమాజంలో భద్రతాభావాన్ని వ్యాప్తి చేస్తోందని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరేదాకా ఈ బృందాలు తమకు అందుబాటులో ఉంటాయన్న భరోసాను కల్పిస్తున్నాయన్నారు. 

తమిళనాడులో రేపు సెలవు: సీఎం పళని

నివర్‌ తుపాను ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు తీరం దాటనున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ డీజీ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఈ తీవ్రత మరీ అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్‌ తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయం దిశగా 380 కి.మీలు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 480 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించారు. మరో 12గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు చెప్పారు. బుధవారం సాయంత్రం పుదుచ్చేరి సమీపంలోని కరైకల్‌ - మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీవ్ర తుపాను నివర్‌ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీల వేగంతో ప్రచండగాలులు వీచే అవకాశం ఉన్నట్టు ఆయన హెచ్చరించారు. బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తమిళనాడు సీఎం పళనిస్వామి రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. 

ఇదీ చదవండి..

లైవ్‌.. నివర్‌ తుపాను ఎటు వెళ్తోంది?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని