నేపాల్​ పార్లమెంట్​ రద్దుకు ప్రధాని సిఫారసు!

నేపాల్‌ పార్లమెంటును రద్దు చేయాలంటూ ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి అధ్యక్షుడికి సిఫారసు చేసింది. ఆదివారం ఉదయం అత్యవసరంగా భేటీ అయిన మంత్రి మండలి ఈ...........

Updated : 20 Dec 2020 16:29 IST

కాఠ్‌మండూ: నేపాల్‌ పార్లమెంటును రద్దు చేయాలంటూ ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీకి సిఫారసు చేసింది. ఆదివారం ఉదయం అత్యవసరంగా భేటీ అయిన మంత్రి మండలి ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాని పీఠం కోసం ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజా ఘటనతో అవి మరింత తారస్థాయికి చేరుకున్నట్లైంది. 

రెండు వర్గాల్లో ఒకటి ఓలీ నేతృత్వంలోనిది కాగా.. మరొకటి మాజీ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ ఆధ్వర్యంలోనిది. ప్రస్తుతం మనుగడలో ఉన్న హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు 2017లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 275 మంది సభ్యులు ఉన్నారు. మంత్రి మండలి నిర్ణయాన్ని అధికార ఎన్‌సీపీలోని సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మాదవ్‌ కుమాన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రచండ వర్గానికి చెందిన ఈయన మాట్లాడుతూ సమావేశం రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందన్నారు. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలంటూ ప్రచండ వర్గం గత కొన్ని రోజుల నుంచి ఓలీని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.     

తనను పదవి నుంచి దించడానికి భారత్‌, నేపాల్‌లలో కుట్రలు జరుగుతున్నాయని నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలీ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఒకప్పుడు భారత్‌కు ఎంతో స్నేహశీలిగా ఉన్న ఓలీ భారత్‌పై అలా ఆరోపణలు గుప్పించడం తీవ్ర చర్చకు దారితీసింది. జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ భారతదేశం విడుదల చేసిన రాజకీయ పటాలపైనా ఓలీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలంగా భారత భూభాగంలో కొనసాగుతున్న కాలాపానీ, లింపియాదురా ప్రాంతాలు తమ భూభాగంలోనివని వాదించింది. ఉత్తరాఖండ్ నుండి లిపులేఖ్ పాస్ వరకు నిర్మించిన ఓ రహదారిపైనా నేపాల్‌ అనుచిత వ్యాఖ్యలు చేసింది. వీటన్నింటినీ భారత్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. 

ఓలీ తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమైంది. ఎన్‌సీపీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఆయన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. అప్పటి నుంచి ఓలీ రాజీనామా డిమాండ్ ఊపందుకుంది. ఆర్థికంగా కూడా దేశాన్ని సరైన మార్గంలో నడిపించలేకపోయారని ఆయనపై విమర్శలున్నాయి. కొవిడ్‌ను ఎదుర్కోవడంలోనూ విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు చైనాకు చేరువయ్యేందుకే ఓలీ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఆ మధ్య నేపాల్‌లోని చైనా రాయబారితో ఓలీ పలుసార్లు భేటీ కావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఓలీ చైనాకు అంటకాగే విషయంలో వెనక్కి తగ్గినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.

ఇవీ చదవండి..

దిల్లీ గురుద్వారాకు ప్రధాని ఆకస్మిక సందర్శన

రష్యా కాదు, చైనాయే..: ట్రంప్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని