ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి టీకా ఎగుమతి చేయం!

భారతీయులను పణంగా పెట్టి ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి చేయమని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII) స్పష్టం చేసింది.

Updated : 18 May 2021 21:41 IST

ప్రకటన విడుదల చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్‌

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరతతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి చేయడం చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థల్లో ఒకటైన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది. భారతీయుల ప్రాణాలను పణంగా పెట్టి ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి చేయమని స్పష్టం చేసింది. అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో రెండు, మూడు నెలల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి కాదని.. అయినప్పటికీ భారీగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు సాధ్యమైనంత వరకు కృషి చేస్తున్నామని సీరం సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా వెల్లడించారు. ఈ సమయంలో కరోనాపై యుద్ధానికి అంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. విదేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయడానికి గల కారణాలు, ఇదివరకు జరిగిన ఒప్పందాలను పేర్కొంటూ సీరం సీఈవో ప్రకటన విడుదల చేశారు.

* భారత్‌లో జనవరి నెలలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా మొదలైన సమయంలో వ్యాక్సిన్‌ నిల్వలు భారీగా ఉన్నాయి. అదే సమయంలో దేశంలో రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో కొవిడ్‌ ఉద్ధృతి తగ్గిందని నిపుణులు అంచనా వేశారు.

* అదే సమయంలో ప్రపంచంలోనే చాలా దేశాలు కొవిడ్‌ ఉద్ధృతితో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీంతో ఆయా దేశాలను ఆదుకునేందుకు మన ప్రభుత్వం సహకారం అందించింది.

* ఈ మహమ్మారి కేవలం ఒక ప్రదేశానికి, దేశానికి మాత్రమే కేంద్రీకృతం కాదని అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఈ మహమ్మారిని మట్టుబెట్టకపోతే మనకు కూడా రక్షణ ఉండదు. వీటితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పాటైన ‘కొవాక్స్‌’ కార్యక్రమంతో ఇదివరకే ఒప్పందం చేసుకున్నాం.

* ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా గల మన దేశంలో కేవలం రెండు, మూడు నెలల్లోనే వ్యాక్సినేషన్‌ పూర్తి చేయలేం. అందరికీ వ్యాక్సిన్‌ అందించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని. ఇలా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేందుకు దాదాపు రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది.

* కరోనా వ్యాక్సిన్‌కు అమెరికా ఆమోదం తెలిపిన రెండు నెలల తర్వాత మనదేశంలో వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. అయినప్పటికీ సీరం ఇన్‌స్టిట్యూట్‌ 20కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశాం. ఇలా వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాలో ప్రపంచంలోనే మూడో స్థానంలో కొనసాగుతున్నాం. తాజా దేశ అవసరాల దృష్ట్యా ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతోపాటు భారత్‌కే ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగుతుంది. ‘కొవాక్స్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది చివరకు మాత్రమే విదేశాలకు వ్యాక్సిన్ అందించడం ప్రారంభమవుతుంది’’ అని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని