‘ఐదు సంవత్సరాల జైలు, రూ.కోటి జరిమానా’

దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌(ఎన్‌సీఆర్)లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తాజాగా కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది

Updated : 29 Oct 2020 16:56 IST

దిల్లీలో కాలుష్య నియంత్రణకు కమిషన్ ఏర్పాటు చేసిన కేంద్రం

దిల్లీ: దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌(ఎన్‌సీఆర్)లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తాజాగా కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. కమిషన్‌ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఫర్ దిల్లీ-ఎన్‌సీఆర్‌ పేరిట దాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. తాజా నిబంధనల ప్రకారం కాలుష్య కారకులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించనున్నారు. పర్యావరణ కాలుష్యానికి పాల్పడేవారిపై, అలాగే తన ఆదేశాలను ఉల్లంఘించే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అధికారం కమిషన్‌కు ఉంది. అంతేకాకుండా హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలను కూడా కేంద్రం ఈ కమిషన్ పరిధిలోకి తీసుకువచ్చింది.

కమిషన్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి పూర్తికాల ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా..మొత్తం 18 మంది సభ్యులు ఉండనున్నారు. వారిలో సంబంధిత రాష్ట్రాల ఉన్నతాధికారులు, పర్యావరణ వ్యవహారాలను పరిశీలించే నిపుణలు, ఎన్జీఓల నుంచి ముగ్గురు వ్యక్తులు, ఇస్రో నామినేట్ చేసిన వ్యక్తి, నీతి ఆయోగ్ నుంచి సంయుక్త కార్యదర్శి.. పూర్తికాల సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉండనున్నారు. వీరు కాకుండా ఉపరితల రవాణా, విద్యుత్, పట్టాణాభివృద్ధి, గృహ నిర్మాణ, పెట్రోలియం, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల శాఖల నుంచి ఒక్కొక్క అధికారిని సభ్యులుగా నియమించుకునే అవకాశం కేంద్రం కమిషన్‌కు కల్పించింది. కాగా, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఎజెన్సీలు ఇచ్చే ఆదేశాలను తోసిపుచ్చేలా కమిషన్‌కు అధికారాలుండటం గమనార్హం. ఇది వాయు నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు దానికి సంబంధించిన చట్టాలను అమలు చేస్తుంది. అలాగే కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి పరిశోధన, ఆవిష్కరణల కోసం ఉపసంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ఆర్డినెన్స్‌లో పేర్కొంది. 

ఇదిలా ఉండగా..ఇటీవల దిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం సహా ఇతర కాలుష్య కారకాలు పెరుగుతుండటంపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. విశ్రాంత సుప్రీం న్యాయమూర్తితో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఆయా రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని