
కొత్తరకం కరోనా అదుపునకూ అదే మార్గం!
అయితే, కాస్త కఠినంగా అమలు చేయాలి: WHO
వాషింగ్టన్: బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చి యావత్తు ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు ఈ నూతన రకం వ్యాప్తి అదుపు తప్పలేదని స్పష్టం చేసింది. కరోనా కట్టడికి తొలి నుంచి అనుసరిస్తున్న విధానాలనే పాటిస్తే దీన్ని నియంత్రించ వచ్చని వివరించింది. గతంలో ఇంతకంటే భారీ స్థాయి విజృంభణను చూశామని.. దానితో పోలిస్తే దీని వ్యాప్తి అదుపు తప్పలేదని చెప్పవచ్చని అభిప్రాయపడింది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనల్ని పాటించాలని సూచించింది. అజాగ్రత్త వహిస్తే ప్రమాదం తప్పకపోవచ్చునని హెచ్చరించింది.
‘‘ప్రస్తుతం మనం అమలు చేస్తున్న నిబంధనలనే మరింత జాగ్రత్తగా పాటించాలి. అలాగే దీర్ఘ కాలం అనుసరించాలి. అలా అయితే కొత్త రకం కరోనా వ్యాప్తిని అదుపులో పెట్టవచ్చు. కొన్ని విషయాల్లో మరింత కఠినంగా ఉండాల్సిన అవసరమూ ఉంది’’ అని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖేల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.
రూపుమార్చుకున్న ఈ కరోనా వైరస్ ఇప్పటి వరకు బ్రిటన్‌తోపాటు మరో 4-5 దేశాల్లో వెలుగుచూసింది. అయితే కొత్త రకం కరోనా వైరస్ ఇంతకుముందు వైరస్‌తో పోలిస్తే 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్త ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ పేరెత్తితేనే అంతర్జాతీయ సమాజం వణికిపోతోంది. భారత్ సహా అనేక దేశాలు ముందుజాగ్రత్త చర్యగా ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.