Updated : 28 Aug 2020 17:18 IST

నిక్కీ Vs కమల: ఇద్దరూ  ఇద్దరే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవంబరు 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్లు కమలా హారిస్‌, నిక్కీ హేలీలపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. వీరిద్దరూ అగ్రరాజ్యంలో అతి కీలక స్థానాలకు చేరుకోగలిగిన భారతీయ మూలాలున్న మహిళామణులు. కమలా హారిస్‌ డెమోక్రాటిక్‌ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయటంతో... ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన తురుపు ముక్కగా నిక్కీ హేలీని రంగంలోకి దింపారు. ఇద్దరికిద్దరూ మంచి సామాజిక స్థాయి, అనుభవం కలవారే కావటం గమనార్హం.

ఇది ట్రంప్‌కు కమలా హారిస్‌ మధ్య పోటీయా?

డెమోక్రాటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌ ఈమె పేరును ప్రకటించిన వెంటనే బరాక్‌ ఒబామా తదితర ప్రముఖుల మద్దతు లభించింది. అసలు ఈ ఎన్నికల్లో పోటీ ట్రంప్‌కు కమలా హారిస్‌ మధ్యనే అని కొందరు చమత్కరించారంటే ఆమె ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక భారతీయ అమెరికన్లు తొలి నుంచీ రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్ల వైపే మొగ్గుచూపటం ఓ అనుకూలాంశం. ఇక 78 ఏళ్ల జో బైడెన్‌ అనారోగ్య కారణాల వల్ల పదవి దిగిపోయే పరిస్థితి వస్తే... ఆమెకు అధ్యక్షపదవి వరించే అవకాశం కూడా ఉందని పరిశీలకులు అంటున్నారు.

హేలీ..ఆచరణాత్మక వ్యవహార శైలి

పంజాబీ వారసత్వం గల నిక్కీ హేలీ గతంలో దక్షణ కరోలినా గవర్నర్‌గా ఉన్నారు. అనంతరం అమెరికా తరపున ఐక్యరాజ్యజమితి రాయబారిగా కూడా విధులు నిర్వర్తించారు. తొలినుంచీ అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో జాతీయ అంశాలపై ప్రసంగించటంలో నిక్కీకి మంచి పట్టుంది. స్టార్‌ క్యాంపెయినర్‌గా ట్రంప్‌ ఈమెను నియమించిన అనంతరం..అనేక విషయాల్లో ఆమె ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చింది. సొంత పార్టీ వారే వ్యతిరేకించే ట్రంప్‌ దూకుడు ప్రవర్తనకు భిన్నంగా.. ఈమెది ఆచరణాత్మక, మితవాద వ్యవహార శైలి కావటం పార్టీకి కలిసివస్తుంది. 59 చైనా యాప్‌లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వ నిర్ణయాన్ని నిక్కీ కొనియాడటం ఆమెకు మరికొంత మద్దతును కూడగట్టింది. ఇక 2024 ఎన్నికల్లో ఈమె అధ్యక్ష అభ్యర్థి అయ్యే అవకాశముందని అంటున్నారు. అయితే 2001 నాటి ఓటర్‌ రిజిస్ట్రేషన్‌ కార్డులో తనను తాను శ్వేత జాతీయురాలిగా పేర్కొనడం నిక్కీకి ప్రతికూలాంశం.

అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ ప్రభుత్వం తరపున నిక్కీ తెరపైకి రావటంతో అక్కడి భారతీయుల ఓట్లు చీలిపోయే అవకాశముంది. డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ విజయం సాధిస్తే... నిక్కీ ఉపాధ్యక్షురాలు కాగలదని భారతీయులు ఆశిస్తున్నారు. దీనితో.. వీరిద్దరిలో ఎవరు గెలిచినా ఇండో-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావటం తథ్యమని పరిశీలకులు అంటున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని