కేరళలో విరిగిన కొండచరియలు: 9మంది మృతి

కేరళలోని పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇడుక్కి జిల్లా రాజమలలో భారీ కొండ చరియలు......

Updated : 07 Aug 2020 16:34 IST

తిరువనంతపురం: కేరళలోని పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇడుక్కి జిల్లా రాజమలలో భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. చిక్కుకున్న వారంతా తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. 

ఐఏఎఫ్‌ సాయం కోరిన సీఎం
ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇడుక్కి జిల్లాలోని రాజమలలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించినట్టు సీఎం పినరయి విజయన్‌  ట్విటర్‌లో వెల్లడించారు. పోలీసు‌, అగ్నిమాపక దళం, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నట్టు చెప్పారు. కొండ చరియలు విరిగిపడిన ప్రదేశంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించాలని విజయన్‌ భారత వైమానిక దళాన్ని కోరారు.

కొండ చరియలు విరిగిపడిన ప్రదేశం వద్దకు మొబైల్‌ వైద్య బృందాలతో పాటు 15 అంబులెన్స్‌లను పంపినట్టు ఆరోగ్యమంత్రి కేకే శైలజ వెల్లడించారు. అవసరమైతే మరిన్ని వైద్య బృందాలను తరలిస్తామని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మందిని కాపాడగలిగినట్టు అధికారులు చెప్పారు. సహాయక చర్యల కోసం మరో 50మంది స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌బృందాన్ని అక్కడికి పంపిస్తున్నట్టు సీఎం విజయన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు, కేరళలో వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పెరియార్‌ నది నీటిమట్టం పెరిగింది. ఈ నది ఉద్ధృతితో ఆలువా శివాలయం నీటమునిగింది. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్‌, పాలక్కాడ్‌, కోజికోడ్‌, వయనాడ్‌, కన్నూరు, కాసర్‌గోడ్‌లలో ఆరెంజ్‌‌ అలర్ట్‌ ప్రకటించారు. మలప్పురంలో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని