ప్రచారంలో నితీశ్‌పై ‘ఉల్లి’దాడి..!

బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం నితీశ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రచార సభలో నితీశ్‌ ప్రసంగిస్తుండగా.. ఓ వ్యక్తి ఆయనపై ఉల్లిగడ్డలను విసరడం కలకలం సృష్టించింది. మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా

Published : 04 Nov 2020 01:16 IST

పట్నా: బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం నితీశ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రచార సభలో నితీశ్‌ ప్రసంగిస్తుండగా.. కొందరు వ్యక్తులు ఆయనపై ఉల్లిగడ్డలను విసరడం కలకలం సృష్టించింది. మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నితీశ్‌ మంగళవారం మధుబనిలోని హర్లాఖీ ర్యాలీకి హాజరయ్యారు. నితీశ్‌ ప్రసంగిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై ఉల్లిగడ్డలు విసిరారు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై చుట్టూ కవచంలా చేరడంతో నితీశ్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం భద్రతా సిబ్బంది ఉల్లిగడ్డలు విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. వెంటనే నితీశ్‌ స్పందిస్తూ ‘ఆయనను వదిలేయండి. అతడిపై అంత దృష్టి పెట్టవద్దు’ అని సూచించారు. అనంతరం ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ఆర్జేడీ  15ఏళ్ల పాలన గురించి విమర్శలు గుప్పించారు. ‘తేజస్వీ అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. గతంలో 15 ఏళ్ల పాలనలో వారు ఇచ్చింది కేవలం 95వేల ఉద్యోగాలే. కానీ వారితో పోలిస్తే మేం ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం’అని విమర్శించారు. 

కాగా నితీశ్‌కు ఈ ఎన్నికల్లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవడం ఇది రెండో సారి. ఇటీవల ఇంకో ప్రచార ర్యాలీలోనూ కొందరు వ్యక్తుల తీరుకు నితీశ్‌ అసహనానికి లోనయ్యారు. ఆయన ప్రసంగిస్తుండగా.. లాలూ జిందాబాద్‌ అంటూ కొందరు నినాదాలు చేశారు. దీంతో నితీశ్‌ స్పందిస్తూ.. ‘ఇష్టం ఉంటే ఓటు వేయండి లేదంటే లేదు..’ కానీ ఇక్కడ గందరగోళానికి గురిచేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు సైతం ఇదే తరహా నిరసనల్ని ఎదుర్కొన్నారు. కాగా బిహార్‌లో మంగళవారం రెండో విడత ఎన్నికలు నిర్వహించారు. నవంబర్‌ 7వతేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్‌ 10న విడుదల చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని