కర్ణాటక దిశగా నివర్‌!

పుదుచ్చేరీ సమీపంలో తీరం దాటిన నివర్ తుపాను క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారిన నివర్‌ వాయువ్య దిశగా కదిలి కర్ణాటకవైపు వెళ్లే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది

Published : 26 Nov 2020 13:50 IST

చెన్నై: పుదుచ్చేరీ సమీపంలో తీరం దాటిన నివర్ తుపాను క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారిన నివర్‌ వాయువ్య దిశగా కదిలి కర్ణాటకవైపు వెళ్లే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. రానున్న ఆరు గంటల్లో తుపాను మరింత బలహీనపడనుందని ఐఎండీ వెల్లడించింది. అయితే ప్రమాదం పూర్తిగా పోయినట్లు కాదని, తుపానులో కొంతభాగం ఇంకా సముద్రంలోనే కేంద్రీకృతమై ఉందని ఐఎండీ ట్విటర్‌ వేదికగా హెచ్చరించింది. తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై, పుదుచ్చేరిలో బుధవారం భారీ వర్షం కురిసింది. శుక్రవారం వరకు చెన్నైలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. 

జలమయమైన పుదుచ్చేరి

నివర్‌ ప్రభావంతో పుదుచ్చేరిలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బలమైన ఈదురుగాలులకు భారీ సంఖ్యలో చెట్లు నేలకూలాయి. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత శిబిరాలకు తరలించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి గురువారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, వచ్చే 12 గంటల్లో విద్యుత్తు‌ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. మరోవైపు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 

తేరుకుంటున్న చెన్నై

తుపాను ప్రభావంతో చెన్నైలో నిన్న భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. అయితే, ప్రస్తుతం చెన్నై వాసులు కాస్త తేరుకుంటున్నారు. సాధారణ కార్యకలాపాలు కొనసాగడంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. నివర్‌ కారణంగా నిన్నటి నుంచి మూసివేసిన చెన్నై ఎయిర్‌పోర్టులో గురువారం ఉదయం తిరిగి సేవలు ప్రారంభించారు. మధ్యాహ్నం నుంచి చెన్నై మెట్రో, బస్‌ సేవలను పునరుద్ధరించారు. అయితే ఇంకా కొన్ని కాలనీల్లో వర్షపు నీరు భారీగా ఉండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. 

అమిత్ షా హామీ..

తమిళనాడు, పుదుచ్చేరిలో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామితో అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని