AstraZeneca: ఆస్ట్రాజెనెకా రెండో డోసుతో..అదనంగా రక్తం గడ్డకట్టే ముప్పులేదు

ఆస్ట్రాజెనెకా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్నవారిలో అదనంగా రక్తం

Updated : 29 Jul 2021 10:55 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

లండన్‌: ఆస్ట్రాజెనెకా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్నవారిలో అదనంగా రక్తం గడ్డకట్టే ముప్పు ఉండదని బ్రిటన్‌కు చెందిన ఔషధ, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్‌ఆర్‌ఏ) ధ్రువీకరించింది. భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఈ టీకాను తయారు చేస్తోంది. ఆస్ట్రాజెనెకా తొలిడోసు వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో స్వల్పంగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం (థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో కూడిన థ్రోంబోసిస్‌-టీటీఎస్‌) తలెత్తుతున్నట్టు గుర్తించారు. దీంతో పలు దేశాలు ఈ టీకా వినియోగంపై వెనకడుగు వేస్తున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించిన ఎంహెచ్‌ఆర్‌ఏ... తొలి, మలి డోసు తీసుకున్న ఎంతమందిలో టీటీఎస్‌ తలెత్తుతోందన్న దానిపై అధ్యయనం సాగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఔషధాలు, టీకాల కారణంగా ఎంతమందిలో టీటీఎస్‌ తలెత్తుతోందన్న ఆరోగ్య భద్రత వివరాలను విశ్లేషించింది. ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తీసుకున్న 10 లక్షల మందిలో 8.1 మందికి వ్యాక్సిన్‌ కారక థ్రోంబోటిక్‌ థ్రోంబోసైటోపెనియా తలెత్తగా, రెండో డోసు తీసుకున్నవారిలో 2.3 మందిలోనే ఈ సమస్య అత్యంత స్వల్పంగా కనిపిస్తున్నట్టు గుర్తించింది.

‘‘మా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత టీటీఎస్‌ సంభవించేందుకు నిర్దిష్ట కారణాలేవీ లేవు. అయినా, దుష్ప్రభావాలకు సంబంధించి మా పరిశోధనలు కొనసాగుతాయి. ఒకవేళ ఎవరిలోనైనా రక్తం గడ్డకట్టే పరిస్థితి తలెత్తితే తక్షణ చికిత్సతో దాన్ని అధిగమించవచ్చు’’ అని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు 80కు పైగా దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని