సరిహద్దు వివాదం:ఎలాంటి చొరబాట్లు లేవు

గత ఆరునెలల కాలంలో భారత్, చైనా సరిహద్దులో ఎటువంటి చొరబాట్లు చోటుచేసుకోలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.

Published : 16 Sep 2020 14:37 IST

రాజ్యసభలో చర్చకు దారితీసిన మంత్రి ప్రకటన

దిల్లీ: గత ఆరునెలల కాలంలో భారత్, చైనా సరిహద్దులో ఎటువంటి చొరబాట్లు చోటుచేసుకోలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. లద్దాఖ్ ప్రాంతంలో చైనా దళాల చొరబాట్లపై వస్తోన్న నివేదికలను తక్కువ చేసి చూపుతూ వాటిని ‘దురాక్రమణకు ప్రయత్నాలు’గా కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో ఎంపీ అనిల్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..‘ఆరు నెలల కాలంలో భారత్‌, చైనా సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు నమోదు కాలేదు’ అని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. దానిపై ఆయన వివరణ కూడా ఇవ్వలేదు. అలాగే ఫిబ్రవరి నుంచి పాకిస్థాన్‌ వైపు నుంచి 47 సార్లు చొరబాట్లకు ప్రయత్నాలు జరిగాయన్నారు.  

మే నెల నుంచి సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొని ఉన్న తరుణంలో మంత్రి ప్రకటన సభలో వివాదానికి దారి తీసింది. అసలు చొరబాట్లే జరగనప్పుడు, ఇరు దేశాల సైనిక, దౌత్య భేటీల్లో భాగంగా యథాతథ స్థితిని పునరుద్ధరించాలని భారత్ ఎందుకు డిమాండ్ చేసిందని ప్రశ్నించాయి. కాగా, మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనకు నిత్యానంద్‌ రాయ్‌ ప్రకటన విరుద్ధంగా లేదని హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. చొరబాటు అనే పదం ఉగ్రవాదులకు వర్తిస్తుందంటూ వివరణ ఇచ్చారు. 

ఇదిలా ఉండగా..వాస్తవాధీన రేఖ వద్ద ఏకపక్షంగా యథాతథస్థితిని మార్చే చైనా కుట్రను భారత్‌ తీవ్రంగా అడ్డుకుంటుందని మంగళవారం లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. చైనాకు దీటుగా సమాధానం చెప్పేందుకు భారత్‌ సైన్యం సిద్ధంగా ఉందని చెప్తూనే.. లద్దాఖ్ ప్రాంతంలో భారత్‌ కఠిన సవాళ్లను ఎదుర్కొంటోందని అంగీకరించారు.  

చైనాతో ప్రతిష్టంభనపై భారత ప్రభుత్వం మొదటి నుంచి స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. తూర్పు లద్దాఖ్లోని భారత భూభాగంలోకి చైనా చొరబడినట్లు అంగీకరించినట్లుగా ఉన్న పత్రాలను ఆగస్టులో రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. అనంతరం రెండు రోజుల తరవాత దాన్ని తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని