వేలానికి ఒబామా దంపతుల దుస్తులు

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. ఆయన సతీమణి మిచెల్‌ ధరించిన దుస్తులు వేలంలో విక్రయించనున్నారు. ఈ మేరకు వేలం నిర్వహించే జూలియన్‌ ఆక్షన్‌ సంస్థ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. బరాక్‌ ఒబామా చిన్నతనంలో వేసుకున్న స్పోర్ట్స్‌ టీషర్ట్‌, 2010లో

Published : 05 Oct 2020 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. ఆయన సతీమణి మిచెల్‌ ధరించిన దుస్తులను వేలంలో విక్రయించనున్నారు. ఈ మేరకు వేలం నిర్వహించే జూలియన్‌ ఆక్షన్‌ సంస్థ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. బరాక్‌ ఒబామా టీనేజ్‌లో ధరించిన స్పోర్ట్స్‌ జెర్సీ, 2010లో అమెరికా తొలి మహిళగా ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు మిచెల్‌ ఒబామా ధరించిన కాక్‌టెయిల్‌ డ్రెస్‌ను వేలంలో పెట్టినట్లు తెలిపింది. డిసెంబర్‌ మొదటివారంలో ఒబామా జెర్సీ, మిచెల్‌ డ్రెస్‌ వేలం వేయనున్నట్లు వెల్లడించింది.

బరాక్‌ ఒబామాకు బాస్కెట్‌బాల్‌ క్రీడ అంటే ఎంతో ఇష్టమని అందరికి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా అధికారిక భవనం శ్వేతసౌధంలో ఉన్నప్పుడు అక్కడున్న టెన్నిస్‌ కోర్టును బాస్కెట్‌బాల్‌ కోర్టుగా మార్చేశారు. చిన్నతనం నుంచే ఒబామా బాస్కెట్‌బాల్‌ ఆడేవారు. అలా హవాయ్‌లోని పునాహో స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు బాస్కెట్‌బాల్‌ ఆడే సమయంలో ఒబామా స్పోర్ట్స్‌ జెర్సీ ధరించారు. దానిపై ఆయన చదువుకున్న స్కూల్‌ పేరు, 23 నంబర్‌ రాసి ఉంది. ఆ జెర్సీనే ఇప్పుడు వేలానికి పెట్టారు. దానితోపాటు 1979నాటి ఒబామా స్కూల్‌ ఇయర్‌ బుక్‌ ఇవ్వనున్నారు. జెర్సీ‌, స్కూల్‌ ఇయర్‌బుక్‌ కలిపి వేలంలో కనీసం 1,50,000డాలర్ల(దాదాపు రూ.కోటి) నుంచి 2,00,000 డాలర్ల(దాదాపు రూ.1.46కోట్లు) వరకు అమ్ముడుపోతుందని వేలం నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మిచెల్‌ ఒబామా ధరించిన నలుపు రంగు డ్రెస్‌ కనీసం 50వేల డాలర్లు(దాదాపు రూ.36లక్షలు) నుంచి 70వేల డాలర్ల(దాదాపు రూ.51లక్షలు) వరకు అమ్ముడవుతుందని భావిస్తున్నారు. బేవర్లీ హిల్స్‌లోని జూలియన్‌ ఆక్షన్‌ గ్యాలరీలో డిసెంబర్‌ 4న ఒబామా జెర్సీ‌, ఇయర్‌ బుక్.. డిసెంబర్‌ 6న మిచెల్‌ ఒబామా డ్రెస్‌ వేలంపాట కార్యక్రమం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని