
జేఈఈ, నీట్‌ను వాయిదా వేయండి: ఒడిశా సీఎం
భువనేశ్వర్: కరోనా వ్యాప్తి దృష్ట్యా సెప్టెంబర్ 1 నుంచి నిర్వహించతలపెట్టిన జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఒడిశా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు లేఖ రాశారు. దేశంలో కారోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అంత శ్రేయస్కరం కాదని లేఖలో పేర్కొన్నారు.
ఒడిశా నుంచి దాదాపు 50,000 మంది నీట్ ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నారు. మరో 40,000 మంది జేఈఈ మెయిన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదైన కారణంగా ప్రజా రవాణా నిలిచిపోయిందని, ఒక వేళ పరీక్షలు నిర్వహించినట్లయితే విద్యార్థులు తమ కేంద్రాలకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పట్నాయక్ తన లేఖలో వివరించారు. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షలు వాయిదా పడవని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. ఒడిశా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం 8 పట్టణాలను కూడా ఎంపిక చేసింది.
జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తదితరులు పరీక్షలను వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరారు. పరీక్షల నిర్వహణపై బిహార్‌లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ వైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుండగా.. మరోవైపు కరోనా అలజడి సృష్టిస్తోంది. అందువల్ల పరీక్షలు వాయిదా వేయాలని ఆర్జేడీ నేతలు చిరాగ్ పాశవాన్, తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు డిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా పరీక్షల నిర్వహణకు విముఖత చూపారు. సీట్లను భర్తీ చేసేందుకు ఎమైనా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని కోరారు.
అయితే, సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు కూడా విడుదలయ్యాయి. మొత్తం 8,58,273 మంది మెయిన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. వచ్చే నెల 13న తలపెట్టిన నీట్ -2020 కోసం 15,97,433 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి త్వరలోనే అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.