1000 మందితో హజ్‌ యాత్ర!

ఏటా జరిగే హజ్‌ యాత్రను ఈసారి అత్యంత సాదాసీదాగా జరపాలని సౌదీ ప్రభుత్వ నిర్ణయించింది. కేవలం 1000 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించింది. జులై 29న ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు...........

Updated : 17 Oct 2022 14:56 IST

రియాద్‌: ఏటా జరిగే హజ్‌ యాత్రను ఈసారి అత్యంత సాదాసీదాగా జరపాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం 1000 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించింది. జులై 29న ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. సౌదీ అరేబియాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి సుప్రీం కోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ తెలిపింది. 

సౌదీలో నివసిస్తున్న వారిని మాత్రమే ఈసారి హజ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించనున్నారు. వీరిలో 30 శాతం మంది సౌదీ దేశస్థులు కాగా.. మరో 70 శాతం మంది సౌదీలో నివసిస్తున్న విదేశీయులు ఉండనున్నట్లు సౌదీ హజ్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చే యాత్రికుల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఆధునిక సౌదీ చరిత్రలో విదేశీయుల్ని అనుమతించకపోవడం ఇదే తొలిసారి. 

కరోనా నేపథ్యంలో యాత్రా స్థలంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మక్కాకు చేరుకోవడానికి ముందే యాత్రికులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే యాత్ర తర్వాత వారంతా గృహ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. ఏటా ఈ యాత్రకు దాదాపు 2.50 లక్షల మంది హాజరవుతుంటారని అంచనా.

ఇప్పటికే భారత్‌ నుంచి ఈసారి హజ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఇక్కడి హజ్‌ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. యాత్రకు టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని