ఆచట్టాలపై ప్రతిపక్షాల వైఖరి సరికాదు: కేంద్రమంత్రి 

వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. తొలుత వ్యవసాయ బిల్లులోని నిబంధనలకు మద్దతు తెలిపిన పార్టీలు ఇప్పుడు వ్యతిరేకించడమేంటని ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

Published : 07 Dec 2020 18:58 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. తొలుత వ్యవసాయ బిల్లులోని నిబంధనలకు మద్దతు తెలిపిన పార్టీలు ఇప్పుడు వ్యతిరేకించడమేంటని ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ మేరకు ప్రసాద్‌ సోమవారం ఓ సమావేశంలో మాట్లాడారు. ‘వ్యవసాయ రంగంలో కేంద్రం చేపట్టిన సంస్కరణలపై రైతుల్లో నెలకొన్న అపోహల్ని వివరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కానీ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని విమర్శించారు. రాజకీయ పార్టీల జోక్యం లేకుండా రైతులు నిరసనలు చేస్తున్నప్పటికీ.. కొన్ని పార్టీల నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అందులో వచ్చి చేరుతున్నారని అన్నారు. 

ఈ సందర్భంగా రవిశంకర్‌ ప్రసాద్‌ 2019 ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోను చదివి వినిపించారు. అందులో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీఎంసీ(వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ) చట్టాన్ని రద్దు చేసే హామీని ఇచ్చిందని వెల్లడించారు. గతంలో యూపీఏ హయాంలో శరద్‌పవార్‌ వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో ఏపీఎంసీ చట్టాన్ని సవరించాల్సిందిగా వారు కోరారని.. కానీ ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం ఆయా చట్టాల్ని తీసుకువస్తే మాత్రం వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఇలా రెండు విధాలుగా వ్యవహరించడం సరికాదని ప్రసాద్‌ హెచ్చరించారు.  

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం ఐదో రౌండు చర్చలు విఫలం కావడంతో 12వ రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రైతు సంఘాలు డిసెంబర్‌ 8న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు దాదాపు 14పైగా ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. మరోవైపు ఈ రైతుల నిరసనల నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితుల గురించి రాష్ట్రపతికి వివరించేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ డిసెంబర్‌ 9న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

ఇదీ చదవండి

బంద్‌కు భారీ మద్దతు

పోలీసుల అదుపులో అఖిలేశ్‌ యాదవ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని