ట్రంప్‌కు మద్దతు తెలిపిన బిన్‌లాడెన్‌ బంధువు

అమెరికాతో పాటు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన 9/11 ఉగ్రదాడికి సూత్రధారి అయిన ఒసామా బిన్‌లాడెన్ బంధువు నూర్‌ బిన్‌ లాడెన్‌ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు.

Published : 08 Sep 2020 01:16 IST


 

వాషింగ్టన్‌: అమెరికాతో పాటు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన 9/11 ఉగ్రదాడికి సూత్రధారి అయిన ఒసామా బిన్‌లాడెన్ బంధువు నూర్‌ బిన్‌ లాడెన్‌ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. ట్రంప్ మాత్రమే అమెరికాను రక్షించగలరని ప్రశంసించారు. డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్ ఎన్నికైతే మరోసారి ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఒసామా బిన్‌ లాడెన్‌ సవతి సోదరుడి కుమార్తె నూర్ బిన్‌ లాడెన్‌. ఆమెది స్విట్జర్లాండ్. తాను స్విట్జర్లాండ్లో నివసిస్తున్నప్పటికీ, తన మనసులో మాత్రం అమెరికాకే ప్రాధాన్యమని చెప్పుకుంటుంది. తన 14 ఏట తన అంకుల్ 2001లో అమెరికాపై ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. తన చిన్నతనంలో అమెరికాలో పర్యటించానని, దాన్ని తన రెండో ఇల్లుగా భావించానని,  దాంతో ఆ దాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.   

కాగా, ఆమె మొదటిసారి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. బరాక్‌ ఒబామా, జోబిడెన్‌ అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడే ఐసీస్‌ విస్తరించిందని, ట్రంప్‌ మాత్రం అలాంటి కార్యకలాపాలను మొగ్గదశలోనే మట్టుపెడతారంటూ ప్రశంసించింది. ట్రంప్‌ రాజకీయ ప్రవేశం చేసిన దగ్గరి నుంచే ఆయన్ను అనుసరిస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో ఆయనకే తన మద్దతని ప్రకటించారు. గతంలో కూడా ఆమె ట్రంప్‌కు మద్దతు తెలిపిన సందర్భాలున్నాయి. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని