ఆ చట్టాలు కశ్మీర్‌లో వర్తించవేం?: ఒమర్‌ 

దేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక భూ చట్టాలు జమ్మూకశ్మీర్‌లో ఎందుకు వర్తించవని మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై ప్రశ్నించినపుడు తాము దేశద్రోహులం ఎందుకు అవుతామని కేంద్రాన్ని విమర్శించారు.

Published : 30 Oct 2020 01:18 IST

శ్రీనగర్‌: దేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక భూ చట్టాలు జమ్మూకశ్మీర్‌లో ఎందుకు వర్తించవని మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై ప్రశ్నించినపుడు తామే ఎందుకు దేశద్రోహులం అవుతామని కేంద్రాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆయన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ‘పలు ఈశాన్య రాష్ట్రాల్లో భూములపై ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి. హిమాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఇతర భారతీయులు భూములు కొనడానికి వీల్లేదు. అలాంటి చట్టాలు జమ్మూకశ్మీర్‌కు ఎందుకు వర్తించవు? ఆ విషయం గురించి ప్రశ్నించినపుడు మేం మాత్రమే ఎందుకు దేశ ద్రోహులమవుతాం?’ అని ఒమర్‌ ప్రశ్నించారు. 

‘జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలను కీలక పాత్ర పోషించకుండా కేంద్రం చేయాలనుకుంటోంది. మన స్వరం బలహీనంగా ఉన్నందుకే ఈ రోజు వాళ్లు(కేంద్రం) తమ ప్రణాళిక అమలు చేశారు. మన ఉనికి, భూమిని కాపాడుకోవడానికి అందరం ఏకమవ్వాలి. రాజ్యాంగ హక్కులను కావాలని శాంతియుతంగా కోరడం తప్పేం కాదు. ఈ రోజు నూతన భూ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపట్టడానికి పీడీపీకి అనుమతిఇవ్వలేదు. రాజ్యాంగ పరంగా మా హక్కులను మేం అడగటం కూడా తప్పా’ అంటూ ఒమర్‌ అడిగారు. జమ్మూకశ్మీర్‌లో భూచట్టాల నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకనుంచి జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల వ్యక్తులు సైతం భూమి కొనుగోలు చేసేందుకు వెసులుబాటుకల్పిస్తూ ఇటీవలే ఆదేశాలు జారీచేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని