భారత్‌లో ఈ వ్యాక్సిన్‌కే తొలి అనుమతి?

బ్రిటన్‌కు చెందిన కరోనా వ్యాక్సిన్‌కు తొలి అనుమతి లభించనుందనే వార్తలు వినవస్తున్నాయి.

Updated : 27 Dec 2020 14:04 IST

దిల్లీ: జనవరిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను‌ అందుబాటులో తెచ్చేందుకు భారత్‌లో ముమ్మర  ప్రయత్నాలు సాగుతున్నాయి. సరైన టీకా ఎంపిక విషయంలో కేంద్రం ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన కరోనా వ్యాక్సిన్‌కు తొలి అనుమతి లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాకు సంబంధించి.. పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చే వారం అత్యవసర అనుమతి లభించే అవకాశం ఉంది.

భారత్‌లో అత్యవసర అనుమతుల కోసం ఇప్పటి వరకు భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్, ఫైజర్ సంస్థలు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకున్నాయి. కాగా, ప్రయోగాల విషయమై అదనపు సమాచారం కావాలని సంస్థకు చెందిన నిపుణుల కమిటీ ఎస్ఐఐ, భారత్‌ బయోటెక్‌లను కోరింది. కాగా, అవసరమైన టీకా సమాచారాన్ని కమిటీ ముందు సమర్పించేందుకు సమయం కోరినందున, ఫైజర్‌ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేదు. ఐతే ఫైజర్‌కు ఇప్పటికే బ్రిటన్‌, అమెరికా, బహ్రైన్‌లలో అనుమతులు లభించటం గమనార్హం. కాగా, భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌ టీకా ‘కొవాగ్జిన్‌‌’ మూడో దశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతుండటంతో.. అనుమతి లభించేందుకు ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ టీకా కొవిషీల్డ్‌కే తొలి అనుమతులు వచ్చే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన అనంతరం.. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నిపుణుల కమిటీ సమావేశమై, దేశ విదేశాల్లో ఈ వ్యాక్సిన్‌పై చేపట్టిన ప్రయోగాలకు సంబంధించి టీకాల భద్రత, వ్యాధి నిరోధకత సామర్థ్యం తదితర గణాంకాలను క్షుణ్నంగా పరిశీలిస్తుంది. అనంతరం అత్యవసర అనుమతులు మంజూరు చేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ తలెత్తడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే దాని ప్రభావం త్వరలో అందుబాటులోకి రానున్న టీకాలపై ఉండదని భారత ప్రభుత్వాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ అనుమతితో ఇప్పటికే 40 మిలియన్‌ డోసుల ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..

ఆరునెలల కనిష్ఠానికి కరోనా కేసులు..

కరోనా చివరి మహమ్మారి కాదు.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని