ఆక్స్‌ఫర్డ్‌ టీకా 70శాతం సమర్థత!

కరోనా పోరులో గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకా ప్రయోగ ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి.

Published : 23 Nov 2020 14:18 IST

300కోట్ల డోసులే లక్ష్యంగా టీకా తయారీ
వెల్లడించిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ

లండన్‌: కరోనా పోరులో గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకా ప్రయోగ ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న వారిలో 70.4శాతం సమర్థత కనబరచినట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రకటించింది. ఇక రెండు డోసుతో దాదాపు 90శాతం వరకూ ప్రభావవంతంగా వైరస్‌ను ఎదుర్కోగలదని మధ్యంతర సమాచార విశ్లేషణలో అభిప్రాయపడింది. అయితే టీకా సమర్థత సరాసరిగా 70 శాతం ఉందని అంచనా వేసింది. దీంతో ఈ టీకా తీవ్రమైన వ్యాధి బారినుంచి పూర్తిరక్షణ కల్పిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ స్పష్టంచేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23వేల వాలంటీర్లపై ప్రయోగాలు జరుపగా, వీరి మొత్తం సమాచారాన్ని స్వతంత్ర సమీక్ష కోసం అందుబాటులో ఉంచుతామని ఆక్స్‌ఫర్డ్‌ వెల్లడించింది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ వినియోగ అనుమతుల కోసం సాధ్యమైనంత తొందరగా నియంత్రణ సంస్థలను సంప్రదిస్తామని పేర్కొంది.

300 కోట్ల డోసులే లక్ష్యంగా..!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌లో భాగంగా ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నా, స్పుత్నిక్‌-వి టీకాలు ప్రయోగ ఫలితాలను, వాటి సమర్థతను వెల్లడించాయి. ఈ విషయంలో కాస్త వెనకబడిన ఆక్స్‌ఫర్డ్‌ తాజాగా మధ్యంతర ఫలితాలను ప్రకటించింది. ఆస్ట్రాజెనెకాతో పాటు మరికొందరి భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రణాళిక రచిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పేర్కొంది. కేవలం 2021 సంవత్సరంలోనే 300 కోట్ల డోసులను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది.

ఎలాంటి ఫ్రీజర్లు అవసరం లేదు..
వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తున్న తరుణంలో టీకా నిల్వపై పలు సవాళ్లు ఎదురౌతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఆక్స్‌ఫర్డ్‌ టీకాను నిల్వచేసుకునేందుకు ఎటువంటి ప్రత్యేక ఫ్రీజర్లు అవసరం లేదని ఆక్స్‌ఫర్డ్‌ స్పష్టంచేసింది.  కేవలం, సాధారణ రిఫ్రిజిరేటర్లలోనే టీకాను నిల్వచేసుకోవచ్చని ప్రకటించింది. తద్వారా ప్రస్తుతమున్న ఆరోగ్యవ్యవస్థల సహకారంతో చాలా తేలికగా వ్యాక్సిన్‌ను అందరికీ సరఫరా చేసుకోవచ్చని అభిప్రాయపడింది.

ఇదిలాఉంటే, మిగతా వ్యాక్సిన్‌లతో పోలిస్తే ఆక్స్‌ఫర్డ్‌ టీకా ధర చాలా తక్కువగానే ఉండనున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ నిపుణులు ఇప్పటికే పేర్కొన్నారు. భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌(కొవిషీల్డ్‌) ధర రూ.500-600కే అందుబాటులో ఉండనుందని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్‌ పూనావాలా ఈమధ్యే వెల్లడించారు. దీంతో రెండు డోసుల ధర వెయ్యి నుంచి రూ 1200 వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

ఇవీ చదవండి..
కొవిడ్‌ టీకా: ఆక్స్‌ఫర్డ్‌పైనే ఆశలు..!
ఈ వారంలోనే ఫైజర్‌ టీకాకు అనుమతి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని