Published : 31 Dec 2020 01:41 IST

ఆక్స్‌ఫర్డ్‌ టీకా: ఏ గేమ్‌ ఛేంజర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాక్సిన్‌లలో గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వినియోగానికి బ్రిటన్‌లో ఆమోదం లభించింది. ఫైజర్‌, మోడెర్నా టీకాలతో పోలిస్తే సామర్థ్యంతో ఆక్స్‌ఫర్డ్‌ టీకా కాస్త వెనుకబడే ఉందని చెప్పొచ్చు. ఆ రెండు టీకాలు 90శాతానికి సామర్థ్యం కలిగి ఉన్నాయని ప్రకటించగా.. ఆక్స్‌ఫర్డ్‌ మాత్రం 70 శాతం సమర్థతే ఉందని మధ్యంతర నివేదికల్లో వెల్లడించింది. అయినప్పటికీ యావత్‌ ప్రపంచం ఆక్స్‌ఫర్డ్‌ టీకావైపే ఆసక్తిగా చూస్తోంది. ఇందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

ప్రభావవంత పనితీరు..
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా ‘ఏజెడ్‌డీ1222’ (కొవిషీల్డ్‌) కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అయితే, మూడో దశ ప్రయోగాలను రెండు విధాలుగా జరిపింది. ఒక విధానంలో రెండు డోసులను ఇచ్చి పరీక్షించిన ఆస్ట్రాజెనెకా, మరో విధానంలో ఒక పూర్తి డోసు, మరో అరడోసుతో ప్రయోగం జరిపింది. ఇందులో ఒకదానిలో 62 శాతం, మరో విధానంలో 90 శాతం సమర్థత సాధించినట్లు వెల్లడించింది. తాము అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ సరాసరి 70 శాతం సమర్థత కలిగి ఉన్నట్లు మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది. ఇక ఆసుపత్రుల్లో చేరే తీవ్రత ఉన్న కేసుల్లో వందశాతం రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కల్‌ సోరియట్‌ వెల్లడించారు.

కొత్తరకాన్ని ఎదుర్కొనే సామర్థ్యం..
ఆక్స్‌ఫర్డ్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ బ్రిటన్‌లో కొత్తగా వెలుగుచూసిన రకంపైనా పనిచేసే సామర్థ్యం ఉందని ఆస్ట్రాజెనెకా నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే, ఎంతవరకు ఇది ఎదుర్కొంటుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని, దీనిపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రాజెనెకా సీఈఓ స్పష్టంచేశారు. మరికొన్ని వారాల్లోనే కొత్తరకాన్ని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను కూడా తొందరలోనే అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

తక్కువ ధరకే..
ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ల ధరలతో పోలిస్తే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా ఖరీదు చాలా తక్కువని తెలుస్తోంది. కేవలం దాదాపు మూడున్నర డాలర్ల (రూ.250)కే ఒక డోసు అందించే అవకాశాలున్నాయి. అదే ఫైజర్‌, మోడెర్నా టీకాల ఒక్కో డోసు ధర 20డాలర్లకు పైనే ఉన్నాయి. దీంతో చాలా దేశాల్లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన కోవాక్స్‌ కూటమికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

సులభంగా టీకా నిల్వ..
ఏదైనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన దాన్ని సరైన వాతావరణంలో నిల్వ చేయడమే అత్యంత ముఖ్యమైన అంశం. ఫైజర్‌ టీకాను నిల్వ చేయడానికి మైనస్‌ 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరమని తెలిసిందే. దీంతో ఆ టీకా నిల్వ, సరఫరా చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్నది. కానీ, ఆస్ట్రాజెనెకా టీకాను కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్ల (2 నుంచి 8 డిగ్రీలు) ఉష్ణోగ్రత వద్వే నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత వద్ద దీన్ని ఆరు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. దీంతో మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా సరఫరా చేసే ఆస్కారం ఉంటుంది.

భారీస్థాయిలో ఉత్పత్తి..
టీకా వినియోగానికి అనుమతులు వచ్చిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొంది. ఇందుకోసం భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లోనూ వీటిని సరఫరా చేసేందుకు వీలుగా దాదాపు 5 కోట్ల డోసులను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. ఇక యూకేలోనూ పెద్దఎత్తున వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. బ్రిటన్‌లో జనవరి చివరికల్లా వారానికి 40లక్షల డోసుల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అంతేకాకుండా 2021 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా పేర్కొంది.

ఇవీ చదవండి..
ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు యూకేలో అనుమతి
కొవిడ్‌ టీకా: ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తీసుకున్నారంటే..!

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని