ఆక్స్‌ఫర్డ్‌ టీకా: వృద్ధుల్లో సమర్థవంతంగా..!

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్‌‌ యూనివర్సిటీ సహాయంతో ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్‌, వృద్ధుల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.

Published : 19 Nov 2020 17:49 IST

 రెండో దశ ఫలితాలను ప్రచురించిన లాన్సెట్‌
ఫైజర్‌, మోడెర్నాల ప్రకటనల నేపథ్యంలో మరింత ఆసక్తి

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్‌‌ యూనివర్సిటీ సహాయంతో ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్‌, వృద్ధుల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. తాజాగా ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయ్సల్‌ ఫలితాలను ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ‘ది లాన్సెట్’ ప్రచురించింది. వీటిలో మెరుగైన ఫలితాలు రావడంతో ప్రస్తుతం కొనసాగుతోన్న తుది దశ ప్రయోగాల్లోనూ వృద్ధుల్లో టీకా బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుందని ఆక్స్‌ఫర్ట్‌ భావిస్తోంది. అందుకే, తుదిదశ ప్రయోగ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో, టీకా ఫలితాల్లో ముందువరుసలో ఉన్న ఫైజర్‌, మోడెర్నా, స్పుత్నిక్‌ టీకాలు ప్రదర్శించిన స్థాయిని ఈ టీకా అందుకుంటుందా? లేదా? అన్న విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

కరోనా వైరస్‌ ప్రభావం వృద్ధుల్లోనే ఎక్కువగా చూపిస్తోన్న విషయం తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్న వారిలోనూ ఎక్కువగా 60ఏళ్ల పైబడినవారే ఉంటున్నారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీకా ప్రయోగాలు కేవలం 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులపైనే జరుగుతున్నాయి. అయితే, ఆస్ట్రాజెనెకా మాత్రం వృద్ధుల్లోనూ వ్యాక్సిన్‌ ప్రయోగాలను చేపడుతోంది. వీటిలోభాగంగా, 70ఏళ్లకు పైగా వయస్సు ఉన్నవారిపై కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. టీకా ఇచ్చిన అనంతరం యువకుల్లో మాదిరిగానే వయసుపైబడిన వారిలోనూ ఈ టీకా రోగనిరోధక ప్రతిస్పందన చూపిస్తున్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. టీకా తీసుకున్న 560 మంది వాలంటీర్లలో 240 మంది 70ఏళ్లకు పైబడినవారే ఉన్నట్లు తెలిపింది. అయితే, టీకాతో స్వల్ప దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ మొదటి డోసు తీసుకున్న 14రోజుల్లో యాంటీబాడీల ప్రతిస్పందనను గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. తొలి డోసు తీసుకున్న 28రోజుల్లో రెండో డోసు (బూస్టర్‌ డోస్) వేయగా.. ఇది తీసుకున్న 209 మందిలో 208 మంది వాలంటీర్లలో టీకా స్థిరమైన పనితీరును కనబరిచినట్లు తాజా నివేదికలో పేర్కొన్నారు.

అయితే, వృద్ధుల్లో బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపించడం చాలా సవాల్‌తో కూడుకున్నదని ఆక్స్‌ఫర్డ్‌ టీకా సమాచార విశ్లేషకురాలు ఏంజిలా మినాసియన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రయోగాల్లో వృద్ధుల్లోనూ ఈ రకమైన సానుకూల ఫలితం ఇవ్వడం ద్వారా యువకులతోపాటు పెద్దవారిలోనూ టీకా సామర్థవంతంగా పనిచేస్తుందన్న భావవను ఆమె వ్యక్తం చేశారు. అయితే, వీటి తుది ఫలితాలు మరికొన్ని వారాల్లోనే వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలాఉంటే, తాము అభివృద్ధిచేసిన టీకా 95శాతం సమర్థత చూపిస్తున్నట్లు ఫైజర్‌ ఈమధ్యే వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే నియంత్రణ సంస్థల అనుమతి కోసం దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక మరో కంపెనీ మోడెర్నా తయారు చేసిన టీకా కూడా 94.5శాతం సమర్థత చూపిస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ కూడా 92శాతం సమర్థత కలిగినట్లు ఇదివరకే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ‘గేమ్‌ ఛేంజర్‌’గా భావిస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా తుదిదశ ఫలితం ప్రకటన ఆసక్తిగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని