Published : 09 Sep 2020 17:47 IST

ఆ ఎఫెక్ట్‌ భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌పై ఉండదు

సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా

పుణె: కరోనా వ్యాక్సిన్‌ బరిలో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనికా టీకా ప్రయోగాలకు యూకేలో తాత్కాలికంగా బ్రేక్ ‌పడటంపై పుణెలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) స్పందించింది. యూకేలో జరిగిన ఆ ఘటన ప్రభావం ఇక్కడ తమ సంస్థ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి చేస్తున్న ప్రయోగాలపై ఉండదని స్పష్టంచేసింది. భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ యథాతథంగానే కొనసాగుతాయని ఎస్‌ఐఐ సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. టీకా ప్రయోగాల్లో ఇప్పటివరకు అవాంఛనీయ ఘటనలేవీ నమోదు కాలేదని పేర్కొన్నారు. తమ సంస్థ అభివృద్ధి చేస్తున్న టీకా ఉత్పత్తి తాము నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఎస్‌ఐఐ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. 

మరోవైపు, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనికా టీకా మూడో దశ ప్రయోగాల సందర్భంగా బ్రిటన్‌లో ఓ వాలంటీర్‌ అనారోగ్యానికి గురికావడంతో ప్రస్తుతానికి ట్రయల్స్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ వాలంటీర్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయనేది మాత్రం ఆస్ట్రాజెనికా వెల్లడించలేదు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇలాంటి సమస్యలు సాధారణమేనని, ఇంత భారీ సంఖ్యలో ట్రయల్స్‌ నిర్వహించినప్పుడు ఇలా జరుగుతుంటాయని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఇలా జరిగినప్పుడు లోతైన పరిశీలన చేసి తిరిగి ప్రయోగాలను కొనసాగిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రాజెనికా టీకాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని