ఆ ప్రయోగ విజయావకాశాలు 50శాతమే!

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విషయంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అన్నింటికంటే ముందున్నట్లు తాజాగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ కట్టడి కోసం రూపొందించిన ఈ ప్రయోగాత్మక టీకాపై తదుపరి పరీక్షలు చేపట్టాలని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా నిర్ణయించారు.

Updated : 24 May 2020 12:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విషయంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అన్నింటికంటే ముందున్నట్లు తాజాగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ కట్టడి కోసం రూపొందించిన ఈ ప్రయోగాత్మక టీకాపై తదుపరి పరీక్షలు చేపట్టాలని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా నిర్ణయించారు. తొలి దశ ప్రయోగంలో మెరుగైన ఫలితాలు రావడంతో వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలకమైన రెండో దశలో దాదాపు 10వేల మంది వాలంటీర్లపై ప్రయోగించేందుకు ఆక్స్‌ఫర్డ్‌ సిద్ధమైంది. అయితే ఈ వ్యాక్సిన్‌ ప్రయోగ విజయావకాశాలు కేవలం 50శాతమేనని వ్యాక్సిన్‌ అభివృద్ధిచేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ జెన్నెర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ అడ్రియన్‌ హిల్‌ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధికి జరుగుతున్న పోటీలో ఆక్స్‌ఫర్డ్‌ తయారుచేసిన ChAdOx1 nCoV-19 అనే వ్యాక్సిన్‌ ప్రయోగదశల్లో ముందంజలో ఉన్నట్లు ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలాంటి కీలక సమయంలో బ్రిటన్‌లో ఈ వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం ప్రయోగానికి అడ్డంకిగా మారే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమూహంలో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నందున ఈ పదివేల మంది వాలంటీర్లలో ఫలితం కనిపించకపోవచ్చనే ఆందోళన నెలకొందని అడ్రియన్‌ హిల్‌ అన్నారు. వైరస్‌ అదృశ్యం, సమయంపై ఈ వ్యాక్సిన్‌ ప్రయోగం ఆధారపడి ఉందని ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడ్రియన్‌ హిల్‌ వెల్లడించారు. ఇలాంటి సమయంలో 50శాతం ఫలితాలు రాకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు అడ్రియన్‌ హిల్‌ పేర్కొన్నారు. ప్రముఖ మందుల తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధికి కృషి చేస్తోన్న విషయం తెలిసిందే. 

గత ఏప్రిల్‌లో తొలిదశ ప్రయోగాల్లో భాగంగా మానవుల్లో ప్రయోగాత్మక పరిశోధనలు చేపట్టారు. తొలిదశలో మెరుగైన ఫలితాలు కనిపించడంతో ఈ వ్యాక్సిన్‌పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఏప్రిల్‌ నెలలో బ్రిటన్‌లో అత్యంత ప్రభావం చూపిన కొవిడ్‌ మహమ్మారి తీవ్రత మే నెలలో తగ్గుతూ వస్తోంది. ఈ సమయంలోనే వ్యాక్సిన్ ప్రయోగ విజయావకాశాలపై ఆందోళన నెలకొంది. బ్రిటన్‌లో ఇప్పటివరకు 2,57,000 మందికి ఈ వైరస్‌ సోకగా వీరిలో ఇప్పటివరకు 36వేల మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 54లక్షలకు చేరుకోగా వీరిలో ఇప్పటివరకు 3లక్షల 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని