ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు: మోదీ

74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా  ఆరోగ్యం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు.

Updated : 15 Aug 2020 10:38 IST

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని 

దిల్లీ: 74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా  ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన  నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని వెల్లడించారు.

‘దేశంలోని ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు లభిస్తుంది. వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది’ అని మోదీ వెల్లడించారు. ఈ ఎన్‌డీహెచ్‌ఎం.. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి వస్తుంది. ఇది దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అలాగే సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద్యులు, హెల్త్‌ ప్రొవైడర్లు ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉంది. దీనికింద మారుమూల ప్రాంతాలకు కూడా టెలీ మెడిసిన్‌, ఈ- ఫార్మసీలు సేవలు అందనున్నాయి. అలాగే ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందడానికి వీలు కలగనుంది. దేశంలో కరోనావైరస్‌ మహమ్మారి విలయ తాండవం కారణంగా టెలీ మెడిసిన్‌, డిజిటల్‌ వైద్య సేవలకు ప్రాముఖ్యత ఏర్పడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని