భారీ ఉగ్రకుట్ర భగ్నం.. మోదీ సమీక్ష

ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Updated : 20 Nov 2020 17:16 IST

దిల్లీ: ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లో నగ్రోటాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు వచ్చినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టడాన్ని ప్రధాని అభినందించారు. పెద్ద ఎత్తున మారణాయుధాలు, పేలుడు పదార్థాలతో భారీ దాడికి ప్రణాళికలు రచించిన ఉగ్రవాదులను భారత జవాన్లు ముందస్తుగానే కనిపెట్టారని అన్నారు. భారీ వినాశనాన్ని అడ్డుకున్న భద్రతా దళాలను ప్రధాని మరోసారి కొనియాడారు. తాజా పరిస్థితులపై ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోబాల్‌, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లాతోపాటు ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

జమ్ము కశ్మీర్‌లో నలుగురు జైషే-మహ్మద్‌ ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. నగరోటా టోల్‌ప్లాజా దగ్గర గురువారం  ఈ సంఘటన జరిగింది. ముందుగా పోలీసులను చూసి తీవ్రాదులను తీసుకెళ్తున్న ట్రక్కు డ్రైవర్‌ పారిపోయారు. వెంటనే పోలీసులు వాహనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.  ఎదురుకాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. వీరినుంచి 11 ఏకే రైఫిళ్లు, 3 పిస్టళ్లు, 29 గ్రనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ముంబయి దాడి కంటే భారీ కుట్రకు అమలు చేసేందుకే సరిహద్దు దాటి భారత్‌లోకి ఈ నలుగురు ఉగ్రవాదులు చొరబడ్డట్లు భద్రతా దళాలు గుర్తించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని