పట్టాలెక్కిన కిసాన్‌ రైలు @100

దేశంలో వందో కిసాన్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బెంగాల్‌లోని షాలిమార్‌ వరకు ప్రయాణించే ఈ రైలుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ......

Published : 28 Dec 2020 19:07 IST

వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించిన ప్రధాని

దిల్లీ: దేశంలో వందో కిసాన్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బెంగాల్‌లోని షాలిమార్‌ వరకు ప్రయాణించే ఈ రైలుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రైతు సాధికారతలో కిసాన్‌ రైలు ఓ పెద్ద ముందడుగు అన్నారు. గత నాలుగు నెలల్లోనే ఈ రైలు నెట్‌వర్క్‌ విస్తరించిందని చెప్పారు. కిసాన్‌ రైలు సర్వీసులు దేశ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఉపకరిస్తున్నాయన్నారు. దేశంలో 80శాతంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. వ్యవసాయరంగంలో చరిత్రాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, వ్యవసాయాన్ని, రైతులను బలోపేతం చేసేలా అనేక సంస్కరణలు చేపడుతున్నామని మోదీ చెప్పారు. రైతులను, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా నిబద్ధతతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌ పాల్గొన్నారు.

త్వరగా పాడైపోయే అవకాశం ఉన్న పండ్లు, కూరగాయల లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు అనుమతిస్తూ కిసాన్‌ రైళ్లను కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రవాణా ఛార్జీలపై 50శాతం రాయితీని కూడా రైతులకు అందిస్తోంది. ఆగస్టు 7న మహారాష్ట్రలోని దేవ్‌లాలీ నుంచి బిహార్‌లోని దాదాపూర్‌ వరకు తొలి కిసాన్‌ రైలు ప్రారంభించిన కేంద్రం.. ఆ తర్వాత దాన్ని ముజఫర్‌పూర్‌ వరకు పొడిగించింది. ఈ రైలుకు రైతుల నుంచి విశేష స్పందన రావడంతో గతంలో వారానికి ఒక రోజు నడిచే ఈ రైలు సర్వీసును వారంలో మూడు రోజులకు పెంచారు.

ఇదీ చదవండి..

రైతులను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని