ప్రధాని మోదీ అరుదైన రికార్డు

భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన అవతరించారు....

Published : 13 Aug 2020 20:37 IST

దిల్లీ: భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన నిలిచారు. గతంలో ఈ రికార్డు మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ పేరు మీద ఉండగా, తాజాగా దానిని ప్రధాని మోదీ అధిగమించారు. అలానే ఎక్కువ కాలం పదవిలో ఉన్న నాలుగో ప్రధాని కూడా మోదీనే. ఈ విషయాన్ని ప్రసారభారతి విభాగం ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 2,268 రోజులు పదవిలో ఉండగా గురువారంతో ప్రధాని మోదీ దానిని అధిగమించారు. నరేంద్ర మోదీ దేశ 14వ ప్రధానిగా మే26, 2014న ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి ప్రధానిగా మే30, 2019న పదవీ బాధ్యతలు చేపట్టారు.

అయితే దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన ప్రధానుల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. వారిలో ముందుగా మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ 17 ఏళ్లు పాలించగా, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ 11 ఏళ్లు, మరో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ పదేళ్లపాటు పదవిలో ఉన్నారు. ప్రస్తుత రికార్డుతో పాటు ప్రదాని మోదీ ఇటీవల మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.  అయోధ్యలోని రామజన్మభూమిని దర్శించుకున్న మొట్ట మొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డులకెక్కారు. మోదీ కంటే ముందు ప్రధాని హోదాలో ఇందిరా, రాజీవ్, వాజ్‌పేయ్‌లు ప్రధాని హోదాలో అయోధ్యలో పర్యటించినప్పటికీ.... రామ జన్మభూమికి దూరంగా ఉండిపోయారు. ఆగస్టు 5న భూమిపూజను పురస్కరించుకొని మోదీ ప్రధాని హోదాలో రామ జన్మభూమిని దర్శించుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని