దేశాభివృద్ధికి 2014-29 కాలం కీలకం: మోదీ

భారత ప్రజాస్వామ్యానికి 16 నుంచి 18వ లోక్‌సభల మధ్య కాలం ఎంతో ముఖ్యమైనదని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గడిచిన ఆరు సంవత్సరాల్లో దేశంలో చరిత్రాత్మక అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. దేశరాజధాని దిల్లీలో పార్లమెంటు సభ్యుల

Published : 23 Nov 2020 23:47 IST

దిల్లీ: భారత ప్రజాస్వామ్యానికి 16 నుంచి 18వ లోక్‌సభల మధ్య కాలం ఎంతో ముఖ్యమైనదని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గడిచిన ఆరు సంవత్సరాల్లో దేశంలో చరిత్రాత్మక అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. దేశరాజధాని దిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం చేపట్టిన 76 నివాస ఫ్లాట్ల ప్రారంభ కార్యక్రమానికి మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘యువతకు 16, 17, 18 సంవత్సరాల ప్రాయం ఎంతో ముఖ్యమైనది. అదేవిధంగా యువ దేశమైన భారత్‌కు కూడా 16, 17, 18వ లోక్‌సభ కాలం ఎంతో ముఖ్యమైనది. 16వ లోక్‌సభ జరిగిన 2014-19 మధ్య కాలంలో దేశం చరిత్రాత్మక ప్రగతి కనబర్చింది. ఇప్పుడు 17వ లోక్‌సభ కాలం ప్రారంభమైంది.. ఇందులోనూ ఎన్నో చారిత్రక నిర్ణయాలను తీసుకుంటున్నాం. అందులో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 రద్దు, వ్యవసాయ, కార్మిక చట్టాల సంస్కరణలు వంటివి చేశాం. 2024-29 మధ్య కాలంలో ఏర్పాటు కాబోయే 18వ లోక్‌సభ దేశ చరిత్రలో కీలకంగా మారుతుందని విశ్వసిస్తున్నా. దేశం కోసం మనం సాధించాల్సింది ఎంతో ఉంది. ఆత్మనిర్భర్‌ భారత్‌, ఆర్థిక లక్ష్యాలు ఇలా ఎన్నో సాధించాల్సి ఉంది. అవన్నీ మనం రాబోయే రోజుల్లో చేయాలి’ అని మోదీ వెల్లడించారు.  

‘16వ లోక్‌సభ సభ్యుల ఎంపికలో దేశ ప్రజల మనస్తత్వం ప్రతిబింబిస్తోంది. అందులో దాదాపు 300 మంది తొలిసారి ఎంపీగా ఎన్నికైన వారు కాగా.. ప్రస్తుత సభలో తొలిసారి ఎంపీలైన వారు 260 మంది ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుత లోక్‌సభలో రికార్డు స్థాయిలో మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎంపీలు బిల్లులు ఆమోదంపై దృష్టి పెట్టడమే కాకుండా.. డిబేట్లలోనూ చురుకుగా పాల్గొంటున్నారు’ అని మోదీ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, పార్లమెంటు సభ్యులు, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమవారం 58వ జన్మదినం జరుపుకొంటున్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని